Jul 13,2022 22:46

ప్రజాశక్తి-విజయవాడ అర్బన్‌: డాక్టర్‌ ఎన్‌టిఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ 24, 25వ వార్షిక స్నాతకోత్సవం ఈ నెల 15న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ పింగళమ్‌ తెలిపారు. యూనివర్సిటీ కాన్ఫెరెన్స్‌ హాల్‌లో బుధవారం స్నాతకోత్సవ వివరాలను ఆయన పాత్రికేయులకు తెలిపారు. 2018వ సంవత్సరానికి సంబంధించి నిర్వహిస్తున్న 24వ వార్షిక స్నాత కోత్సవంలో విద్యార్థులకు పతకాలతో పాటు గుండె వైద్య పరిశోధనల్లో, వైద్య రంగంలో అత్యుత్తమ సేవలందించిన వైద్య నిపుణులు, తిరుపతి స్విమ్స్‌ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ జి. సుబ్రహ్మణ్యంకు ఎన్‌టిఆర్‌ హెల్త్‌యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. 2019 సంవత్సరానికి సంబంధించి నిర్వహిస్తున్న 25వ వార్షిక స్నాతకోత్సవంలో పిహెచ్‌డి కోర్సు పూర్తి చేసిన ఐదుగురికి, సూపర్‌ స్పెషాలిటీ డిగ్రీ ఒకరికి, గ్రాడ్యుయేషన్‌ డిగ్రీలు 73 మందికి ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. 5వ తేదీ ఉదయం 11.30 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌, విశ్వ విద్యాలయ కులపతి బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అధ్యక్షత వహిస్తారని, తిరుపతి స్విమ్స్‌ ఉపకులపతి డాక్టర్‌ జి. సుబ్రహ్మణ్యం ముఖ్యఅతిధిగా పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.శంకర్‌, జాయింట్‌ రిజిస్ట్రార్‌ అజయ తదితరులు పాల్గొన్నారు.