ప్రజాశక్తి-విజయవాడ
భవన నిర్మాణ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 13న ధర్నా చౌక్‌లో నిర్వహించే మహా ధర్నా కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు ఎ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. మహాధర్నా విజయ వంతం చేయాలని కోరుతూ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో మారుతి నగర్ సెంటర్లో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఏ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భవన నిర్మాణ రంగం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 13న నిర్వహిస్తున్న ధర్నాకు పెద్ద ఎత్తున కార్మికులను సమీకరించి, ప్రభుత్వానికి కనువిప్పు కల్గించాలన్నారు. కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. ప్రతిపక్షానికి ,అధికార పక్షానికి భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల ఓట్లు అయితే కావాలి కానీ, వారి సమస్యలు పట్టించుకోరని విమర్శించారు. కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని, వారి ఉపాధి పై దెబ్బ కొట్టే చర్యలు మాను కోవాలని కార్మిక శాఖ మంత్రికి, ఎమ్మెల్యేలకి పలు సార్లు వినతిపత్రాల రూపంలో వారి దష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. కార్మికులకు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం సంక్షేమ బోర్డులో ఉన్న కార్మికుల డబ్బును దొడ్డి దారిలో నవరత్నాల పథకాలకు తరలించడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. పైగా కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా అందించే సంక్షేమ పథకాలను నిలుపుదల చేస్తూ సర్కులర్ నెంబర్ 1214 ను ఇవ్వటం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఇప్పటికే కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు అందించే సంక్షేమ పథకాలు (క్లెయిము) లు డబ్బులు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదన్నారు. మరొక పక్క సిమెంటు, ఐరన్ ,మెటీరియల్స్, ఇసుక ధరలు విపరీతంగా పెంచేసి కార్మికులకు ఉపాధి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. తక్షణమే కార్మిక వ్యతిరేక చర్యలను మానుకొని ధరలు తగ్గించిసంక్షేమ బోర్డును పని చేయించి సంక్షేమ పథకాలు కార్మికులకు అందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సెంట్రల్ సిటీ ఉపాధ్యక్షులు యం. బాబురావు మారుతి నగర్ ప్రాంతం అధ్యక్ష కార్యదర్శులు దాసరి.ప్రసాదు, ఆవల.ఉగాది పాల్గొన్నారు.










