May 09,2023 19:38

పోలీసులకు సూచనలు చేస్తున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి కేశవ

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ : ఈ నెల 13వ తేదీన జరిగే జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి కేశవ తెలియజేశారు. మంగళవారం కోర్టులో డిఎస్‌పి చైతన్య, అర్బన్‌, రూరల్‌ సిఐలు నరసింహారావు, పుల్లయ్య అర్బన్‌, రూరల్‌ ఎస్‌ఐలు, చిట్వేలి, పుల్లంపేట, నందలూరు ఎస్‌ఐలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్ని సివిల్‌ కేసులు, క్రిమినల్‌ కేసులు లోక్‌ అదాలత్‌లో పరిష్కరించుకోవాలని పోలీసులకు సూచించారు. పరిష్కారంకాని సివిల్‌ కేసులకు స్టాంప్‌ డ్యూటీ తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు. నందలూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.లత మాట్లాడుతూ రాజీమార్గమే రాజమార్గమని, లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకున్న వారికి కాలం, డబ్బు ఆదా అవుతుందని తెలిపారు. లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కరించబడిన కేసులకు అప్పీల్‌ ఉండదని, లోక్‌ అదాలత్‌ తీర్పు సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని పేర్కొన్నారు.