Jun 24,2022 23:28

ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర నాయకులు బాబూరావు
  • ఇళ్లు, స్థలాలు, టిడ్కో గృహాలపై సిపిఎం రాష్ట్ర నాయకులు బాబూరావు పిలుపు

ప్రజాశక్తి - విజయవాడ
ఇళ్లు, ఇళ్ల స్థలాలు, టిడ్కో గృహాల కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లు, ఇళ్ల పట్టాలు, టిడ్కో గృహాల కేటాయింపు, చెత్త పన్ను రద్దు, మౌలిక సదుపాయాల కల్పన తదితర సమస్యల పరిష్కారం కోసం జూలై 11న ఎన్‌టిఆర్‌జిల్లా కలెక్టరేట్లో జరిగే స్పందన కార్యక్రమంలో పెద్దఎత్తున అర్జీల అందజేసే కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సింగ్‌నగర్‌ 58వ డివిజన్‌ కృష్ణాహోటల్‌ సెంటర్‌లో ఇళ్లు, ఇళ్ల స్థలాల సాధన కోసం సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా జరిగింది. టిడ్కో గృహాలు వెంటనే కేటాయించాలని, ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించాలని, ఇళ్ల స్థలాలు వెంటనే పంపిణీ చేయాలని, చెత్త పన్ను రద్దు చేయాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బాబూరావు మాట్లాడుతూ ప్రజాసమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రాభివృద్ది, నిధులు, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్‌, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ తదితర అంశాల్లో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని విమర్శించారు. అయినా రాష్ట్రంలోని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం నోరు విప్పి కేంద్రాన్ని అడిగే దమ్ము, ధైర్యం లేకుండా పోయాయని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షాలు టిడిపి, జనసేన పార్టీలు కూడా కేంద్రం పట్ల మౌనం వహించడం శోచనీయమన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అటు కేంద్రంలోని మోడీ, ఇటు రాష్ట్రంలోని జగన్మోహన్‌రెడ్డి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అయ్యారని తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎందుకు మద్దతు ప్రకటించారో రాష్ట్ర ప్రజలకు సిఎం జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి బి రమణారావు, నాయకులు ఎస్‌కె నిజాముద్దీన్‌, సిహెచ్‌ నాగార్జున, పిఎస్‌ఎన్‌ మూర్తి, సిహెచ్‌ మారుతి శ్రీనివాస్‌, ఎస్‌కె నాగూర్‌, మహిళా నాయకులు ఎస్‌ విజయలక్ష్మీ, వి చంద్రమణి, యు సుగుణ తదితరులు పాల్గొన్నారు.