ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో : ఈ నెల 11న ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం వెల్లడించారు. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలోనూ పలు చోట్ల ఉరుములు మెరుపులతో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.వాయువ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఇదివరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకూ సముద్రమట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడినట్లు వెల్లడించారు. అల్పపీడనం ప్రభావంతో 11 నుంచి రాగల 3 రోజుల వరకూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
గుంటూరు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పెదకాకాని మండలం నంబురులో గొర్రెల కాపరి కూసం వెంకటరెడ్డి (76) పిడుగుపాటుకు గురై మరణించాడు. పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీలో ఎర్రకాలువ ఉధృతి పెరగడంతో మాధవరం-నిడదవోలు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణాజిల్లాలో భారీ వర్షం నమోదైంది. కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని మూడు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. బదినేహాల్, ఉప్పరహాల్ గ్రామ వంకలు తుంగభద్ర నది ప్రవాహాన్ని తలపించాయి.










