Jan 06,2023 22:08

ఫొటో : వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న టిడిపి నాయకులు

10న ''చలో కావలి''
ప్రజాశక్తి-కావలి : దళితులు, దళిత మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండిస్తూ 10వ తేదీన ''చలో కావలి'' కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని టిడిపి ఎస్‌సిసెల్‌ నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం కావలి పార్టీ కార్యాలయంలో కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆదేశానుసారం రాష్ట్ర పార్టీ కార్యదర్శి జెన్ని రమణయ్య ఆధ్వర్యంలో టిడిపి దళిత సంఘం నాయకులతో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నేతలు మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి, దళితులపై జరుగుతున్న దారుణాలు, మారణకాండలు, ఆడబిడ్డలపై అత్యాచారాలు విపరీమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
దళితులందరూ పేదవారు, మధ్య తరగతి వారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారేనని, వారికి రావాల్సిన లోన్లు ఏమైనా వస్తున్నాయా అని ప్రశ్నించారు. దళితులకు అండగా ఉండాల్సింది పోయి వారి స్వయం ఉపాధి కోసం ఉపయోగించాల్సిన నిధులను దారి మళ్లించడానికి మనసు ఎలా వచ్చిందని జగన్‌ మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు. దళితులపై హత్యలు మానభంగాలు చేస్తూ శారీరకంగా, మానసికంగా కృంగదీశారని ఆవేదన వ్యక్త పరిచారు. చలో కావలిని అడ్డుకోవడానికి హౌస్‌ అరెస్ట్‌లు వంటి కార్యక్రమాలు అధికార పార్టీ వారు చేస్తే జరగబోయే పరిణామాలకు కావలి ఎంఎల్‌ఎ ప్రతాప్‌కుమార్‌రెడ్డి పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రాష్ట్ర ఎస్‌సిసెల్‌ అధికార ప్రతినిధి ఆత్మకూరి నాగరాజు, పార్లమెంటు ఎస్‌సిసెల్‌ ప్రెసిడెంట్‌ కాకి ప్రసాద్‌, నియోజకవర్గ ఎస్‌సిసెల్‌ అధ్యక్షులు దావులూరి దేవకుమార్‌, రాష్ట్ర టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ దార్ల శివకుమార్‌, మండల పార్టీ ఎస్‌సి సెల్‌ అధ్యక్షులు దాసు, పట్టణ పార్టీ ఎస్‌సిసెల్‌ అధ్యక్షులు అక్కిలిగుంట సూర్యప్రకాష్‌, ఎస్‌సి సంఘ ముఖ్య నాయకులు ఇనగంటి అనిల్‌, నేలపాటి మాల్యాద్రి, దాసరి మహేంద్ర, అజరు, వేణు తదితరులు పాల్గొన్నారు.