Jan 30,2023 21:30

జగనన్న చేదోడు మెగా చెక్కును అందిస్తున్న కలెక్టర్‌

         పుట్టపర్తి అర్బన్‌ : 3వ విడత జగన్న చేదోడు కార్యక్రమం ద్వారా జిల్లాలో 10,781 మందికి రూ.10.78 కోట్ల లబ్ధి చేకూరిందని కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ పేర్కొన్నారు. పుట్టపర్తి కలెక్టరేట్‌లో జగన్న చేదోడు పంపిణీ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని సోమవారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ రమణారెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ ఓబుళపతి, పూడా ఛైర్మన్‌ లక్ష్మీ నరసమ్మ, బీసీ కార్పొరేషన్‌ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దారిద్య్య్రరేఖకు దిగువన నివసిస్తున్న వెనుకబడిన వర్గాలు ఆర్ధికంగా ఎదగడానికి, షాపులున్న రజకులు, నాయీబ్రాహ్మణులు, టైలరింగ్‌ వత్తి చేసే వారికి ప్రభుత్వం సంవత్సరానికి రూ.10 వేల రూపాయలు అందిస్తోందన్నారు. అందులో భాగంగా ఈ ఏడాది జిల్లాలో అర్హులైన 10,781 మంది షాపులున్న రజకులు, నాయి బ్రాహ్మణులు, టైలర్లకు రూ.10.78 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. అర్హులు ఎవరైనా ఇంకా మిగిలిపోయి ఉంటే సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, అనంతరం అర్హులైన వారికి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. అనంతరం రూ.10.78 కోట్ల మెగా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రమణారెడ్డి, బిసి కార్పొరేషన్‌ అధికారులు పాల్గొన్నారు.