- చిన్నారులలో ధైర్య సాహసాలు పెంపొందించడమే లక్ష్యం
- ఉప విద్యాశాఖాధికారి కృష్ణప్ప వెల్లడి
ప్రజాశక్తి - బి.కొత్తకోట : చిన్నారులలో ధైర్యసాహసాలు పెంపొందించడమే లక్ష్యంగా స్కౌట్ కబ్ మాస్టర్లు (ప్రాథమిక పాఠశాలలో పనిచేసే స్కౌట్ మాస్టర్లు) పనిచేయాలని మదనపల్లి ఉప విద్యాశాఖ అధికారి కృష్ణప్ప కోరారు. హార్సిలీహిల్స్ నందలి ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో శనివారం స్కౌట్ కబ్స్ విద్యార్థులకు నిర్వహించిన అడ్వెంచర్ ఫెస్ట్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహస కృత్యాలతో పాటు అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, తుపానులు వంటి విపత్కర పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలి, తెలియని ప్రదేశంలో మనుగడ ఎలా సాధించాలి అనే విషయాలను ఈ శిక్షణలో విద్యార్థులకు తెలియజేయాలన్నారు. తల్లిదండ్రులు, గురువులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ సమాజం పట్ల బాధ్యతగా ఉండాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ పోతాన్ని తరిమికొట్టాలని దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.స్కౌట్ తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు, ఉన్నత విలువలు సమకూరతాయన్నారు. అనంతరం గోల్డెన్ యారో అవార్డు పొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా స్కౌట్ విద్యార్థులు ప్రదర్శించిన పిరమిడ్ విన్యాసాలు,తాడు సహాయంతో చెట్లను ఎక్కడం, వంటి సాహస కృత్యాలను పలువురిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో స్కౌట్స్ అండ్ గైడ్స్ సెక్రెటరీ మడితాటి నరసింహారెడ్డి, మదనపల్లి ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి,డిస్టిక్ ట్రైనింగ్ కమిషనర్ భాస్కర్ రెడ్డి,కబ్ మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.










