ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:అసైన్డ్ భూముల రీసర్వే, వెరిఫికేషన్ లక్ష్యానికి దూరంగా సాగుతోంది. ఈ ఏడాది జులై 31 నాటికి 20 ఏళ్ల పైబడి సాగు చేస్తున్న రైతులకు పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి విదితమే. ఇందులో భాగంగా సాగులో ఉన్న అసైన్డ్ భూములను గుర్తించేందుకు వెరిఫికేషన్ సర్వే చేపట్టింది. సెప్టెంబరు నుంచి మూడు నెలల్లోగా వెరిఫికేషన్ సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం.. అక్టోబర్ చివరి నాటికి సర్వే పూర్తికావాల్సివుంది. కానీ సర్వే నత్తనడకన సాగుతుండటంతో ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 27.41 లక్షల ఎకరాలు అసైన్డ్ భూములున్నట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. భూములు అసైన్డ్ చేసిన వారి పేరు మీద ఉన్నాయా? లేదా చేతులు మారాయా? ఎవరైనా కొనుగోలు చేశారా? అనే అంశాలపై అధికారులు సర్వేలో భాగంగా వెరిఫిరేషన్ చేయాల్సివుంది. క్షేత్రస్థాయిలో విఆర్‌ఓలు అసైన్డ్ భూముల వివరాలకు సేకరించాలి. వీరు సిద్ధం చేసిన జాబితాలను తహశీల్దార్లు ధ్రువీకరించాలి. ఆ తర్వాత ఆర్‌డిఓలు, జాయింట్ కలెక్టర్లు పరిశీలించి తుది జాబితా రూపొందించి ప్రభుత్వానికి అందించాలి. అయితే ఇప్పటి వరకు 4 వేల గ్రామాల్లో సుమారు 8 లక్షల ఎకరాల భూములకు మాత్రమే విఆర్‌ఓలు వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. తహశీల్దార్ల స్థాయిలో 2,600 గ్రామాలు వెరిఫికేషన్ పూర్తికాగా, జాయింట్ కలెక్టర్ల స్థాయిలో కేవలం 150 గ్రామాల్లోనే వెరిఫిరేషన్ పూర్తయ్యింది. ఈ నెలాఖరు వరకు 27.41 లక్షల ఎకరాలు వెరిఫిరేషన్ పూర్తి చేయాల్సివుండగా.. ఇంకా వెరిఫై చేయాల్సిన భూములు 19 లక్షల ఎకరాలున్నాయి. రెండు నెలల్లో కేవలం 8 లక్షల ఎకరాలే వెరిఫికేషన్ పూర్తి చేసిన నేపథ్యంలో మిగిలిన 20 రోజుల్లో దాదాపు 11 లక్షల ఎకరాల వెరిఫికేషన్ పూర్తి సాధ్యం కాదని అధికారులే వాపోతున్నారు.










