Sep 24,2023 22:35

విజయవాడలో వందే భారత్‌ రైలు ప్రారంభం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రైల్వేల ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ భారతి ప్రవీణ్‌ పవార్‌ అన్నారు. స్వయం ఆధారిత స్వయం సుస్దిరతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. రైలు ప్రయాణం, రైలు మౌలిక సదుపాయాల నవీకరణకు సంబంధించి 2023 ఎంతో కీలకమైందన్నారు. విజయవాడ - చెన్నై మధ్య వందేభారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలును ఆమె విజయవాడ రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వేలో తాజాగా ప్రారంభిస్తున్న వందేభారత్‌ రైలు మూడోదన్నారు. రైలును ప్రారంభించిన అనంతరం ప్రయాణికులు, పిల్లలతో ఆమె మాట్లాడారు. రైలులో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? తదితర వివరాలను డాక్టర్‌ భారతితోపాటు విజయవాడ ఎంపి కేశినేని నాని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిఆర్‌ఎం నరేంద్ర ఎ పాటిల్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎడిఆర్‌ఎం డి.శ్రీనివాసరావు, ఎడిఆర్‌ఎం ఆపరేషన్స్‌, ఎం.శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

  • 9 వందే భారత్‌ రైళ్లు ప్రారంభం
  • అన్ని ప్రాంతాలకూ అనుసంధానిస్తాం : ప్రధాని మోడీ

దేశవ్యాప్తంగా తొమ్మిది వందే భారత్‌ రైళ్లను ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం ఇక్కడ వర్చువల్‌గా ప్రారంభించారు. 11 రాష్ట్రాల్లోని మతపరమైన, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ తొమ్మిది వందే భారత్‌ రైళ్లను జెండా ఊపి ప్రారంభించే ముందు మోడీ ప్రసంగించారు. భారతీయ రైల్వేలను ఆధునీకరణకు తమ ప్రభుత్వం కఅషి చేస్తోందని ఆయన అన్నారు. వందే భారత్‌ రైళ్లకు ఆదరణ నిరంతరం పెరుగుతోందని, ఇప్పటికే 1,11,00,000 మంది ప్రయాణికులు వాటిలో ప్రయాణించారని మోడీ చెప్పారు. ఇప్పటికే 25 వందేభారత్‌ రైళ్లు నడుస్తున్నాయని, ఇప్పుడు మరో తొమ్మిది కొత్తగా చేరాయని తెలిపారు. ఈ రైళ్లు దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. కొత్త వందే భారత్‌ రైళ్లు విజయవాడ-చెన్నై (రేణిగుంట మీదుగా), ఉదయపూర్‌-జైపూర్‌, తిరునెల్వేలి-మధురై-చెన్నై, హైదరాబాద్‌-బెంగళూరు, పాట్నా-హౌరా, కాసరగోడ్‌-తిరువనంతపురం, రూర్కెలా-భువనేశ్వర్‌ -పూరి, రాంచీ-హౌరా, జామ్‌నగర్‌-అహ్మదాబాద్‌గా ప్రయాణిస్తాయి. ప్రయాణికుల అభిప్రాయాల మేరకు ఈ రైళ్లు కొత్త ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయి