విజయవాడ: రాష్ట్రంలో దురదృష్టకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని మాజీ మంత్రి వడ్డీ శోభనాద్రీశ్వరరావు అన్నారు. చదువుకున్న వారిలో నైపుణ్యాలు వఅద్ధి చేయాలనే సదుద్దేశంతో గతంలో రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పెట్టారని చెప్పారు. సీఎం జగన్ పైశాచికానందం కోసం సీఐడీ ఈ కేసు నమోదు చేసిందని ఆయన విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.''వైసిపికు బిజెపి మద్దతు ఉందని ప్రజలకు అర్థమవుతోంది. ఢిల్లీలో ఏమీ లేని లిక్కర్ పాలసీలో కుంభకోణం జరిగిందని ఈడీ, సీబీఐలతో కేసులు పెట్టారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం అమ్ముతూ రూ.వేలకోట్లు వెనకేసుకుంటున్నా ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్‌షాకు కనిపించడం లేదు. టిడిపి కార్యకర్తలకు, ప్రజలకు ఒకటే చెబుతున్నా. చంద్రబాబు ఏ తప్పూ చేయలేదు.. ఆయన నిర్దోషిగా బయటికి వస్తారు. దేశంలో అన్ని స్కిల్ సెంటర్ల కంటే రాష్ట్రంలోనే నిర్వహణ బాగుందని కేంద్ర సంస్థలు మెచ్చుకున్నాయి. జగన్ ఇప్పటికైనా పద్ధతి మార్చుకో.. లేకపోతే పతనమైపోతావు. నీకంటే నియంత పోకడలు ఎక్కువగా ఉన్న వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారు'' అని శోభనాద్రీశ్వరరావు అన్నారు.










