- అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ
ప్రజాశక్తి-విజయవాడ :నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూనే మరొక వైపు మత మూఢత్వంలోకి వెళ్తున్నారని, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోడానికి హేతువాద సాహిత్యం దోహదం చేస్తుందని అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. మూఢ విశ్వాసాలను నమ్మొద్దని సూచించారు. ద్రవిడ నాట హేతువాద ఉద్యమ పితామహులు, సంఘసంస్కర్త, పెరియార్, అరసం వ్యవస్థాపక అధ్యక్షులు తాపీ ధర్మారావు జయంతి సందర్భంగా అరసం ఆధ్వర్యంలో విజయవాడ ప్రజాశక్తి నగర్‌లోని చండ్ర రాజేశ్వరరావు గ్రంథాలయంలో సాహిత్య సభ ఆదివారం జరిగింది. అరసం ప్రచురించిన ''మణిపూర్ మంటలు'', ''అక్షరమా నీకు వందనం'' పుస్తకాలను ఆవిష్కరించారు. ముఖ్య వక్తగా పాల్గన్న పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమ తొలి రోజుల్లో ఆనాటి సమాజాన్ని శాసిస్తున్న మూఢ విశ్వాసాలు, అస్పృశ్యతకు వ్యతిరేకంగా నాస్తిక, హేతువాదాన్ని ముందుకు నడిపించారని, ఆయన వారసత్వాన్ని నేడు తమిళనాడు కేంద్రంగా స్టాలిన్, ఉదయనిధి వంటి వారు కొనసాగిస్తున్నారని తెలిపారు. జన సాహితి కార్యదర్శి దివికుమార్, అరసం రాష్ట్ర కార్యదర్శి బి.ఎన్ సాగర్ మాట్లాడుతూ నిజాం వ్యతిరేక సాయుధ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర గొప్పదని అన్నారు. ఎపి ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు పి.చంద్రానాయక్ అభ్యుదయ గేయాలను ఆలపించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొప్పర్తి రాంబాబు, ప్రధాన కార్యదర్శి పరుచూరి అజరు కుమార్, కార్యదర్శి మోతుకూరి అరుణ కుమార్, ఎఐఎస్‌ఎఫ్ కార్యదర్శి మందగళ్ళ సాయి కుమార్, అధ్యాపకులు వేణు గోపాల్, తదితరులు పాల్గన్నారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షునిగా ఎన్నికై తొలిసారి నగరానికి విచ్చేసిన పెనుగొండను సత్కరించారు.










