ప్రజాశక్తి-పాలకొల్లు : 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్న వైసిపి టిడిపికి సహకరించిన ప్రస్తుత ఎన్నికల్లో వారికి మెజార్టీ లేకపోయినా కుట్ర, కుతంత్రాలతో టిడిపి అభ్యర్థిని స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టారని ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ చెప్పారు. ఎంఎల్సిగా ఎన్నికైన ఆయన తొలిసారిగా శుక్రవారం పాలకొల్లు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో పాలకొల్లులో వైసీపీ ఘనవిజయం సాధిస్తుందని నిమ్మల రామానాయుడుకు దిమ్మతిరిగేలా తీర్పు ఉంటుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పాలకొల్లుతో సహా 175 నియోజకవర్గాల్లో వైసిపి ఘనవిజయం సాధిస్తుందని చెప్పారు. త్వరలో పాలకొల్లులో ఎస్సీ, బిసి మైనారిటీలతో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వీరవాసరం మండలంలో శివారు గ్రామంకు చెందిన బిసి కులస్థుడైన తనకు జగన్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ స్థాయికి వచ్చానని జీవితాంతం జగన్ కు తోడుగా ఉంటానని చెప్పారు.










