Oct 08,2023 21:18

ఫొటో : మాట్లాడుతున్న సిపిఎం నాయకులు

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి
ప్రజాశక్తి-అనంతసాగరం : రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలను స్థాపించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. సీతారాంపురం మండలం బసినేనిపల్లి గ్రామంలో బయల్దేరిన జిల్లా సమగ్ర అభివృద్ధి పాదయాత్ర 6వ రోజు మండలంలోని లింగంగుంట, పాతదేవరాయపల్లి, ముత్తుకూరు, కొత్తపల్లి, మినగల్లు రేవూరు, శంకర్‌ నగరం గ్రామాల మీదుగా దేపూరు గ్రామం వద్ద పాదయాత్ర ఆదివారం ఆత్మకూరు మండలంలోకి ప్రవేశించింది. పాదయాత్రను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కటారి అజరుకుమార్‌ మాట్లాడుతూ మండలంలో సోమశిల జలాశయం ఉన్న కరువు మండలంగానే ఉందన్నారు.
రాష్ట్రం విడిపోయిన తర్వాత జిల్లాల పునర్విభజనలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న పరిశ్రమలన్నీ తిరుపతి జిల్లాకి వెళ్లిపోవడంతో ప్రస్తుతం జిల్లాలో ఒక్క పరిశ్రమ కూడా లేదన్నారు. జిల్లాలో 20కి పైగా మండలాలు కరువు మండలాలుగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఒక్క పరిశ్రమ లేకుండా లేకపోవడంతో యువతకు ఉద్యోగ అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారన్నారు. వలసల నివారణకు ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలలో పరిశ్రమలు తీసుకొని వచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. జిల్లాకు వరప్రసాదిగా ఉన్న సోమశిల జలాశయం గతంలో వచ్చిన భారీ వర్షాలకు పూర్తిగా జలాశయం కింది భాగం అయిన అప్రాన్‌ పూర్తిగా దెబ్బతిందని, వరదలు వచ్చి రెండు సంవత్సరాలు అయినా ఇంతవరకు సోమశిల జలాశయాన్ని పూర్తిస్థాయిలో మరమత్తులు చేయకపోవడం దుర్మార్గమన్నారు. నవంబర్‌, డిసెంబర్‌లలో భారీ వర్షాలు గానీ కురిస్తే సోమశిల జలాశయ పరిస్థితి ప్రమాదంలో పడుతుందన్నారు. దానివల్ల జిల్లా రైతాంగానికి, జిల్లా ప్రజలకు సాగు, తాగునీరుకు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఆత్మకూరు నుంచి సోమశిలకు వెళ్లే రోడ్డు పూర్తిస్థాయిలో దెబ్బతిన్న ఇంతవరకు రోడ్డుకు మరమ్మతులు చేయకపోవడం జగన్మోహన్‌ రెడ్డి పరిపాలనకు నిదర్శనమన్నారు. మండలంలో భారత్‌ మాల పేరుతో వస్తున్న జాతీయ రహదారిలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన రేటును ప్రకటించి రైతుల వద్ద నుంచి భూములు తీసుకోవాలని కోరారు. అలాకాని పరిస్థితుల్లో భూములు కోల్పోతున్న రైతులతో కలిసి సిపిఎం పార్టీ పోరాటం నిర్వహిస్తుందన్నారు. కరువు మండలాల్లో ప్రజలకు ఉపాధి హామీ పనులను వంద రోజుల నుండి రెండు వందల రోజులకు పెంచి కనీస కూలి రూ.600 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే నాయకులను ఈ సమస్యలపై ప్రజలు నిలదీసి అడగాలి కోరారు. అలాగే దేశంలో బిజెపి అధికారం వచ్చిన తర్వాత మైనార్టీలపై, దళితులపై విపరీతమైన దాడులు చేస్తూ వారిని చిత్రహింసలకు గురిచేస్తుందన్నారు. ఈ ఫాసిస్టు విధానాలు ఉన్న బిజెపిని కేంద్రం నుండి దింపాలన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపికి మద్దతు ఇచ్చే ఏ రాజకీయ పార్టీకైనా ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. అలాగే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఎలాంటి సహాయం చేయకున్నా వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు బిజెపితో చెలిమి కోసం ఆత్రుత పడుతూ కేంద్రం తీసుకొచ్చే ప్రజా వ్యతిరేక విధానాలకు మద్దతిస్తున్నారన్నారు. కావున ప్రజలు రాబోయే ఎన్నికల్లో పైవిషయాలన్నీ గుర్తించి ఎంఎల్‌ఎగా, ఎంపిగా పోటీ చేసే అభ్యర్థులను నిలదీసి అడగాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య, వ్యకాసం జిల్లా కార్యదర్శి మంగళ పుల్లయ్య, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గంట లక్ష్మీపతి, జి.నాగేశ్వరరావు, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు నరసింహ, సిపిఎం మండల కార్యదర్శి అన్వర్‌ బాషా, మండల కమిటీ సభ్యులు డాక్టర్‌ సుబ్బరాయుడు, వేము పెంచలయ్య, ఉప్పలపాడు మస్తాన్‌, భనికా మండల అధ్యక్ష కార్యదర్శులు రహమతుల్లా, మీరాముద్దీన్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆరిఫ్‌, స్కూల్‌ స్వీపర్స్‌ యూనియన్‌ నాయకులు సరసమ్మ, బేబమ్మ తదితర నాయకులు పాదయాత్రలో పాల్గొన్నారు.