
* ప్రముఖ వైద్య నిపుణులు దానేటి శ్రీధర్
ప్రజాశక్తి - శ్రీకాకుళం రూరల్ : మాజీ రాష్ట్రపతి కీ.శే ఎపిజె అబ్దుల్ కలాం జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ప్రముఖ వైద్య నిపుణులు దానేటి శ్రీధర్ అన్నారు. అబ్దుల్ కలాం జయంతి వేడుకలతో పాటు ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని మునసబుపేటలోని గురజాడ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలాం నిరుపేద కుటుంబంలో పుట్టినా, ఆయన సాధించిన విజయాలు ప్రపంచ దేశాలు కీర్తించే స్థాయికి తీసుకెళ్లాయన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో ఏ వసతుల్లేని కాలంలో ఆయన బాల్యం సాగిందని, అయినా అధైర్యపడకుండా ఉన్నత విద్యనభ్యసించారని తెలిపారు. చదువును ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దన్నారు. సమయం ఎంతో విలువైందని, చదువుకునే సమయంలో సమయాన్ని వృథా చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్న సమయంలోనూ చదువుపై అదే ధ్యాస కలిగి ఉండేవారని చెప్పారు. అట్టడుగు స్థాయి నుంచి దేశంలోనే అత్యున్నత స్థానమైన రాష్ట్రపతిగా, అద్భుత శాస్త్రవేత్తగా ఎదిగారని, దేశానికి ఎనలేని సేవలు అందించి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. దానేటి శ్రీధర్ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా పేద విద్యార్థులకు విద్యను అందించేందుకు రూ.20 లక్షల నిధి ఏర్పాటు చేసి, పేద విద్యార్థులకు చేయూతనిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి కె.సుధ, లయన్స్ క్లబ్ సెంట్రల్ మెంటార్ నటుకుల మోహన్, అధ్యక్షులు పొన్నాడ రవికుమార్, పూర్వ అధ్యక్షులు బాడాన దేవభూషణరావు పాల్గొన్నారు. అనంతరం దానేటి శ్రీధర్‌ను లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు.