ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం దళిత యువతి రమాదేవిని హత్య చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు జి.వెంకటేశం డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని చెరువులో నార్పల మండల పరిధిలోని బొందలవాడ ఎస్సీ కాలనీకి చెందిన చెందిన నారాయణస్వామి, నారాయణమ్మ కుమార్తె రమాదేవిని (23) శవమై తేలింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తమ కుమార్తెను హత్య చేసి చెరువులో వేశారని ఆరోపిస్తూ మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ముందు జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులు మాట్లాడుతూ నార్పల మండలం నడిమిదొడ్డి గ్రామానికి చెందిన జాఫర్ అనే వ్యక్తి తమ కుమార్తె ప్రేమ పేరుతో మోసం చేసి హత్య చేశాడని ఆరోపించారు. తమ కుమార్తె కనిపించలేదని 20రోజుల క్రితం నార్పల పోలీస్‌ష్టేషన్‌లో ఫిర్యాదు చేసిన పోలీసులు నిర్లక్ష్యం చేసినందువల్లే ఈ ఘోరం జరిగిందని వాపోయారు. ఇప్పటికైనా నిందితుడిని కఠినంగా శిక్షించకపోతే ఆందోళన విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. వీరి ఆందోళనకు కెవిపిఎస్ మద్దతు ప్రకటించి బాధితురాలి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు జి.వెంకటేష్ మాట్లాడుతూ టిటిసి చదివి ఓ ప్రయివేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న యువతిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన చెరువులో పడేయడం బాధాకరమన్నారు. బాధితులు ఫిర్యాదు చేసిన 20 రోజులకు శవాన్ని బహుమానంగా ఇవడం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఎస్సీ, ఎస్టీల ప్రాణాలంటే అంత చులకనా అని ప్రశ్నించారు. రమాదేవిని చంపిన నిందితునిపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా చేస్తే సమస్యను పక్కదారి పట్టించేందుకు పరిహారం అంశాన్ని ముందుకు తీసుకురావడం బాధాకరమన్నారు. వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేసి నిందితుడు జాఫన్‌ను కఠినంగా శిక్షించాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న ఆర్‌డిఒ మధుసూదన్, తహశీల్దార్ మోహన్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో చర్చించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ సహకారాలతోపాటు నిందితుడిని కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, జిల్లా విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు సి.తిరుపాలు, బాలపెద్దన్న, ఎస్సీ, ఎస్టీ, జెఎసి సాకే హరి, చిన్న ఆంజనేయులు, చంద్ర కొర్రపాడు నాగేంద్ర, వెంకటేష్, రామకృష్ణ, గణేష్‌నాయక్, మంజునాథ, ఓబులేష్, కుళ్లాయప్ప, రామాంజనేయులు, కెవిపిఎస్ జిల్లా కమిటీ సభ్యులు ఎర్రిస్వామి, రాజా, జీవ, బాధిత కుటుంబీకులు తదితరులు పాల్గొన్నారు.
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో మధుసూదన్










