Mar 12,2023 21:02

ప్రజాశక్తి - పాలకోడేరు
వేండ్ర గ్రామానికి చెందిన యుటిఎఫ్‌ సీనియర్‌ నేత యల్లమిల్లి నరసింహమూర్తి (86) అనారోగ్యంతో ఆయన స్వగృహంలో ఆదివారం మృతి చెందారు. నరసింహమూర్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సమయంలో యుటిఎఫ్‌ నాయకుడిగా ఉపాధ్యాయుల సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేశారు. అప్పట్లో జరిగిన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే వృద్ధాప్యం, గత కొంతకాలం నుంచి అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు.
యుటిఎఫ్‌ నేత నరసింహమూర్తికి భార్య సత్యవతి, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెండో కుమారుడు వైఎస్‌ఎన్‌ మూర్తి సిఐటియు మండల కార్యదర్శిగా, సిపిఎం మండల నాయకులుగా పని చేస్తున్నారు. ముఖ్యంగా మూర్తి డెల్టా పేపర్‌ మిల్లు కార్మికుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల పక్షాన నిలబడి యాజమాన్యానికి వ్యతిరేకంగా హక్కుల సాధనకు విశేష కృషి చేశారు.
సిపిఎం సంతాపం
యుటిఎఫ్‌ నేత నరసింహమూర్తి మృతి పట్ల సిపిఎం సంతాపం తెలిపింది. సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జెఎన్‌వి గోపాలన్‌ నరసింహమూర్తి మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యుటిఎఫ్‌ నేతగా నరసింహమూర్తి ఉపాధ్యాయుల సమస్యలపై అనేక పోరాటాలు చేశారని తెలిపారు. ఆయన మృతి బాధాకరమని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మండల కార్యదర్శి అశ్రియ్య, నాయకులు తాడి రామారావు, కడలి అప్పారావు, ఎస్‌.సుబ్బరాజు, దున్న మరియమ్మ, దున్న శాలిని నరసింహమూర్తి మృతదేహాన్ని సందర్శించి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మండల పరిషత్‌ అధ్యక్షులు భూపతి రాజు సత్యనారాయణ రాజు (చంటి రాజు), మాజీ ఎంపిపి పాల వెంకట చలపతిరామ, సర్పంచి కడలి నాగేశ్వరి వీరబాబు, రాజకీయ నాయకులు, గ్రామస్తులు నరసింహమూర్తికి నివాళులర్పించారు.