Oct 20,2023 23:16

యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్‌ కుమార్‌ను అరెస్టు చేస్తున్న పోలీసులు

పజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి, పలాస, టెక్కలి రూరల్‌:  సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ శ్రీకాకుళం కలెక్టరేట్‌ వద్ద రెండు రోజులుగా చేపడుతున్న యుటిఎఫ్‌ నిరవధిక నిరాహార దీక్షలను పోలీసులు శుక్రవారం భగం చేశారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో వాహనాలతో దీక్షా స్థలికి చేరుకున్న పోలీసులు, దీక్షలో కూర్చున్న యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.కిషోర్‌ కుమార్‌, నాయకులు ఎల్‌.బాబూరావు, వై.ఉమాశంకర్‌, జి.నారాయణరావు, పి.ఉమాభాస్కర్‌ను ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు.
పలాస మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో యుటిఎఫ్‌ ఆధ్వర్యాన చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగం చేశారు. దీక్షలో కూర్చొన్న ఐదుగురు యుటిఎఫ్‌ నాయకులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. పోలీస్‌స్టేషన్‌లో యుటిఎఫ్‌ నాయకులను సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌.గణపతి, ఎపిటిఎఫ్‌ (1938) నాయకులు జి.సుభాష్‌, ఎపి ఎన్‌జిఒ మండల అధ్యక్షులు బి.గోపాల్‌, అరుణ్‌ కుమార్‌ పాడి సంఘీభావం తెలిపారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర మాట్లాడుతూ సిపిఎస్‌ కంటే నష్టదాయకమైన జిపిఎస్‌ విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసగిస్తోందన్నారు.
టెక్కలి ఇందిరాగాంధీ జంక్షన్‌ వద్ద చేపట్టిన నిరాహార దీక్షకు సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పొందూరు అప్పారావు మాట్లాడుతూ పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు.