ప్రజాశక్తి-రాయదుర్గం రూరల్ మండల పరిధిలోని 74-ఉడేగోళం గ్రామంలో అక్రమ లే అవుట్లు వెలసినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. లే అవుట్లు వేసిన వ్యక్తులు అధికార పార్టీ నాయకులు కావడం, ప్రభుత్వ అధికారులకు ముడుపులు చెల్లించడం వల్లే అధికారులు నామమా త్రంగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నా రని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేఅవుట్లు వేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సర్వే నంబర్-72లో 23.05 ఎకరాల విస్తీర్ణంలో 260 ప్లాట్లు వేసి విక్రయించేశారు. తాజాగా సర్వే నంబర్-95లో 2.76 ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్లు వేశారని పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి చెబుతుండగా, ఇదే సర్వే నంబర్‌లో 2.39 ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయేతర భూమిగా మార్చుకునే ప్రక్రియకు భూ యజమానులు దరఖాస్తు చేశారని రాయదుర్గం తహసీల్దార్ మారుతి చెబుతుండడం అనుమానాలకు తావిస్తోంది. పంచాయతీ, రెవెన్యూ అధికారులు విస్తీర్ణంకు సంబంధించి చెబుతున్న లెక్కల్లో సుమారు 37 సెంట్ల వ్యత్యాసం ఉంది. రాయదుర్గం నుంచి భూపసముద్రం వెళ్లే ప్రధాన రహదారిలో(74-ఉడేగోళం గ్రామంలో బీటీ రోడ్డు పక్కన) ఈ లేఅవుట్ ఉంది. ఈ లేఅవుట్‌కు భూపసముద్రానికి వెళ్లే ప్రధాన రోడ్డు ఓ వైపు, ఆయతపల్లి గ్రామానికి వెళ్లే మరో రోడ్డు ఇంకో వైపు ఉన్నాయి. వ్యత్యాసం ఉన్న 37 సెంట్ల భూమి ఎలా వచ్చిందో అధికారులే తేల్చాల్సి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లే అవుట్లు వేసేవారు ఎకరాకి 10 సెంట్ల చొప్పున సామాజిక అవసరాలకు, పంచాయతీలకు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధాన రోడ్డు నుంచి వెళ్లేందుకు 40 అడుగులు, అంతర్గత రహదారులకు 33 అడుగుల మేర రోడ్లకు స్థలం వదలాలన్నది ప్రభుత్వ నిబంధన. గ్రామపంచాయతీ అనుమతి పొందాకే ప్లాట్లు విక్రయించాల్సి ఉంటుంది. ఇవేమీ పట్టించుకోకుండా నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసి ప్లాట్లుగా విభజించి రూ. లక్షల్లో వ్యాపారులు ఆదాయం గడిస్తున్నారు. ప్లాట్లను కొనుగోలు చేసిన వారు ఇళ్లను నిర్మించుకునేందుకు పంచాయతీ నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరణ చేసుకునేందుకు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పంచాయతీ విస్తరణ అధికారి రఘురామ్‌రావు తెలిపారు. అక్రమ లేఅవుట్‌లలో వేసిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయరాదని రాయదుర్గం సబ్ రిజిస్ట్రార్‌కు లేఖ పంపినట్లు ఆయన తెలిపారు. అక్రమంగా ప్లాట్లు వేసిన వారికి నోటీసులు ఇచ్చామని పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఇకనైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి, గ్రామపంచాయతీకి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని గ్రామస్థులు కోరుతున్నారు.
74-ఉడేగోళంలో వేసిన అక్రమ లే అవుట్










