Jun 21,2023 22:41

యోగాసనాలు చేస్తున్న కలెక్టర్‌, ఎస్పీ, జెడ్పీ ఛైర్‌పర్సన్‌ తదితరులు

        అనంతపురం కలెక్టరేట్‌ : యోగాను చేయడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వం పొంది ఒత్తిడి దూరం అవుతుందని కలెక్టర్‌ ఎం.గౌతమి పేర్కొన్నారు. బుధవారం నాడు అనంతపురం నగరంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్లో ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో 9వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో జెడ్పీ ఛైర్‌పర్సన్‌ గిరిజమ్మ, ఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాను క్రమం తప్పకుండా చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా యోగ క్లాసులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రస్తుత కాలంలో యువత ఏ పని చేయాలన్నా ఒత్తిడి, నిరాశ ఉందని చెబుతున్నారని, ఒత్తిడి, నిరాశకు ఒకే ఒక మందు యోగ అన్నారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ కాలంతో పరుగులు పెడుతున్న ప్రస్తుత సమయంలో శరీర అలసటను తగ్గించేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ సూర్యోదయం సమయంలో నిద్ర లేచి యోగా చేసే అలవాటును చేయాలన్నారు. జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ భవిష్యత్తు తరాలు యోగను అలవర్చుకోవాలని సూచించారు. యోగ చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా ఎంతో ఉత్సాహంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ వాసంతి సాహిత్య, ఏఎస్పీ హనుమంతు, ఏఆర్డీఎస్పీ శ్రీనివాస్‌, ప్రభుత్వ ఆయుష్‌ సీనియర్‌ వైద్యాధికారులు డా||ఎన్‌.తిరుపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు.