Aug 02,2022 22:45

లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తున్న నగర కమిషనర్‌ అరుణ

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: అధిక వర్షాల నేపథ్యంలో నగరపాలక అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజారోగ్యవిభాగం, ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని నగర కమిషనర్‌ డాక్టర్‌ జె.అరుణ ఆదేశించారు. సోమవారం రాత్రి కమిషనర్‌ టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రజారోగ్య విభాగం అధికారులు, ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు, వార్డుఅడ్మిన్‌, శానిటేషన్‌, ఆరోగ్య కార్యదర్శులతో మాట్లాడారు. వర్షాల కారణంగా ఎక్కడ నీరు నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని శానిటేషన్‌ అధికారులను ఆదేశించారు. అలాగే నిల్వనీటిని తొలగించడానికి అవసరమైన మోటార్లు, ఇతర యంత్రాలు అందుబాటులో ఉంచాలన్నారు. అవసరమైతే రాత్రి సమయంలో అందుబాటులో ఉండేలా ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. నగరంలో నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా, నీరు కలుషితం కాకుండా ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నీటిని క్లోరినేషన్‌ చేయించాలని, ప్రతిఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని తాగాలి వాలంటీర్ల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. వార్డుస్థాయిలో వైద్యశిబిరాలు నిర్వహించాలని, అవసరమైన ప్రాథమిక మందులను అందుబాటులో ఉంచుకోవాలి అన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో ఎంఈ ధనలక్ష్మీ, ఎంహెచ్‌ఓ అనిల్‌ కుమార్‌, ఇతర అధికారులు ఉన్నారు.