Aug 04,2022 21:51

యంత్రాగం అప్రమత్తమై సంసిద్ధంగా ఉండాలి : కలెక్టర్‌
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:
జిల్లాకు భారీ వర్షసూచన కారణంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్‌ భారీ వర్షాల ముందస్తు జాగ్రత్తలపై డిఆర్‌ఓ, ఆర్‌డిఓలు, మునిసిపల్‌ కమీషనర్లు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ, ఎస్‌పిడిసిఎల్‌, వ్యవసాయ శాఖ అధికారులు, తహశీల్దార్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా సచివాలయం, ఆర్‌డిఓ కార్యాలయాలు, మండల కార్యాలయాల్లో ప్రజల సహాయార్థం 24×7 కంట్రోల్‌ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 9491077325 అని, మండల కార్యాలయాల్లోనూ 24×7 కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని, విఆర్‌ఓలు, విఆర్‌ఎలను అప్రమత్తం చేయాలని తెలిపారు. అలాగే జిల్లాలో కుప్పం, పలమనేరు డివిజన్‌ మరియు చిత్తూరు డివిజన్‌ గంగాధరనెల్లూరు మండలం వరకు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఆర్‌డిఓలు, తహశీల్దార్లు విపత్తునిర్వహణలో భాగంగా పంచాయతీరాజ్‌, ఎస్‌పిడిసిఎల్‌, రేస్కో, ఇరిగేషన్‌, రూరల్‌ వాటర్‌ సప్లై, పిహెచ్‌ ఇంజినీరింగ్‌, మున్సిపల్‌ కమీషనర్లతో సమన్వయం చేసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరదలు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం చేయాలని, కాజ్‌వే ఓవర్‌ ఫ్లో కావడం, చెరువు కట్టలు తెగడం వంటివి ఎక్కడైనా జరిగితే ఇరిగేషన్‌శాఖ ఎస్‌ఈతో సమన్వయం చేసుకుని వెంటనే సహాయకచర్యలు చేపట్టాలని, మండలస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని చెరువులలో నీటినిల్వలను పరిశీలించాలని డిఆర్‌ఓకు సూచించారు. ఎటువంటి విపత్తు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ, పట్టు పరిశ్రమ, ఉద్యాన శాఖ మరియు పశు సంవర్థక శాఖల అధికారులు రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు.