యాప్‌ల యాతన
చదువులెట్టా చెప్పేది..
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
బాలబాలికలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన అయ్యోర్లు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్తయాప్‌తో సతమతమౌతున్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులతో చర్చించకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. పేస్ స్కానింగ్ చేసేలా కొత్త యాప్‌ను తీసుకురావడం పట్ల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతంగా చదువులు చెప్పే వాతారవణం కల్పించాల్సిందిపోయి రకరకాల యాప్‌లు ఉపాధ్యాయులపై ఒత్తిడి పేంచేలా ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన యాప్‌ను రద్దు చేయాలని కోరుతున్నాయి.
ఉపాధ్యాయ సంఘాలు జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపట్టి ముఖ ఆధారిత హాజరు యాప్‌ను రద్దు చేయాలంటూ జిల్లా విద్యాశాఖాధికిరి వినతి చేశాయి. నాడు-నేడుతో ప్రభుత్వ బడులకు కొత్త కళను తీసుకొచ్చిన ప్రభుత్వం అమ్మఒడి, జగన్న విద్యాకానుక, మధ్యాహ్న భోజన పధకంలో తీకొచ్చిన మార్పులో ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు పెరిగాయి. ఈనేపధ్యంలో ఉపాధ్యాయులను ఒత్తిడికి గురిచేసేలా ప్రభుత్వం హాజరు నమోదులో కొత్తయాప్ తీసుకురావడం ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేసేలా ఉందంటున్నారు.
సర్వర్, నెట్‌వర్క్ సమస్యలు..
ఉదయాన్నే పాఠశాలకు వచ్చినా సర్వర్, నెట్ సరిగా లేకపోవడంతో లేటుగా హాజరుపడుతుండటంతో ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందని మారుమూల గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు వాపోతున్నారు. జిల్లాలోని మారుమూల గ్రామాల్లో పనిచేసే మహిళ ఉపాధ్యాయులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందన్నారు. సమయానికి చేరుకున్నా సర్వర్, నెట్‌సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తోందంటున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన ముఖఆధారిత హాజరు యాప్‌తో హాజరు నమోదులోనే ఎక్కువ సమయం అయితపోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ ఉపాధ్యాయులకు స్మార్ట్‌ఫోన్ వినియోగించటం రాకపోవటంతో ఇబ్బందిగా మారుతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికొన్నత, ఉన్నత పాఠశాలలు 4,828 ఉన్నాయి. ఇందులో 3,64,446 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి హాజరుశాతం కూడా ఉపాధ్యాయులు కొత్తయాప్‌లో తీసుకోవాల్సి ఉంటుంది. సర్వర్, నెట్‌సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. పాఠశాల ఆవరణంలో ఫోటో తీసుకున్నా యాప్‌లో పాఠశాలలో ఆవరణంలో తీసుకోవాలని చూపించడం, సర్వర్ పనిచేయడం లేదని మరలా ప్రయత్నించాలని సూచించటంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. విద్యాప్రమాణాలు పెంపుకు ఏమాత్రం ఉపయోగం లేకపోగా కేవలం ఉపాధ్యాయులను ఒత్తిడికి గురిచేసేలా ఉన్న ముఖఆధారిత హాజరు నమోదు యాప్‌ను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
డివైజర్లు నెట్‌సౌకర్యం కల్పించాలి
యుటిఎఫ్ జిల్లాకార్యదర్శి జివి. రమణ
ప్రభుత్వం కొత్తయాప్ తీసుకొచ్చింది ఉపాధ్యాయులు ఇబ్బందులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ ఆధారిత హాజరు యాప్‌లో నమోదు చేయాలంటే ప్రతి పాఠశాలలో నెట్ సౌకర్యం ఉండాలి. ప్రభుత్వం ప్రతి ప్రభుత్వపాఠశాలలో డివైజర్లు, నెట్ సౌకర్యం కల్పించాలి. క్రమంగా పాఠశాల ఆవరణంలో ఉపాధ్యాయులు సెల్‌పోన్ వాడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. వివిధ రకాల యాప్‌ల నమోదుకు సమయం సరిపోతోంది. భోధనకు ఇబ్బంది కలుగుతోంది. కొత్త విధానం తీసుకొచ్చే ముందు ఉపాధ్యాయ సంఘాలతో చర్చిస్తే క్షేత్రస్థాయిలో వచ్చి ఇబ్బందులు చెప్పే అవకాశముంటుంది.










