Apr 10,2023 21:09

ప్రజాశక్తి - ఇరగవరం
సాంప్రదాయ వ్యవసాయ రంగంలో డ్రోన్‌ టెక్నాలజీ తీసుకురావడం వల్ల కూలీలు ఉపాధి కోల్పోతారని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్ల చిన వీరభద్రరావు ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలోని గోటేరు గ్రామంలో పంట కాలువలో పనిచేస్తున్న ఉపాధి కూలీలను కలిసి వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వీరభద్రరావు మాట్లాడుతూ ఏడాది పొడవునా కూలీలకు పని కల్పించేందుకు ప్రభుత్వం అంచనా కట్టిన విలువ రూ.89 వేల కోట్లు అయితే ఇటీవల ప్రకటించిన బడ్జెట్లో కేటాయించింది రూ.60 వేల కోట్లు మాత్రమేనని తెలిపారు. దీంతో కూలీలకు చేతినిండా పని దొరికే పరిస్థితి లేదన్నారు. వ్యవసాయ రంగంలో ఇప్పటి వరకూ పురుగు మందులు జల్లుతున్న డ్రోన్లు ఇక నుంచి తక్కువ సమయంలో వరి నాట్లు వేసేందుకు ఆధునిక సాంకేతిక హంగులతో డ్రోన్‌ అనే యంత్రాన్ని ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రి యూనివర్సిటీలో పరిశోధన చేస్తున్నారని వీరభద్రరావు తెలిపారు. ఇప్పటికే వ్యవసాయ రంగంలో వినియోగిస్తున్న యాంత్రీకరణ, బెంగాల్‌ కూలీలు మన ప్రాంతానికి రావడం వల్ల కూలీలకు పని దినాలు తగ్గిపోయాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఉపాధి హామీని ప్రతిష్టంగా అమలు చేసి అడిగిన ప్రతి కుటుంబానికీ 200 రోజులు పని కల్పించాలని లేకుంటే చట్టప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కడలి దుర్గ, జుత్తిగ లక్ష్మి, దొంగ రాజేశ్వరి, అంబటి నరేంద్ర, మురళీకృష్ణ, కాటి శాంతకుమారి, జుత్తిగ సత్యనారాయణ, గుబ్బల ప్రసాద్‌, జుత్తిగ వరలక్ష్మి పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం : అడిగిన ప్రతి కుటుంబానికీ పని కల్పించాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు డిమాండ్‌ చేశారు. సోమవారం జగనాధపురంలోని ఉపాధి పని ప్రదేశంలో కూలీలతో ఆయన మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంవత్సరం పనులు ఇప్పుడిప్పుడే కల్పిస్తున్నారని, అది కూడా పూర్తిస్థాయిలో కల్పించడం లేదని, పని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఉపాధి కూలీ 600 రూపాయలు ఇవ్వాలని, కుటుంబానికి రెండు వందల రోజులు పని కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు నాయుడు పిన్నమనేని సుబ్బారావు, పి.కోటేశ్వరరావు, తోట సత్యనారాయణ, మేకా ప్రసాద్‌, పెంటపాడు శ్రీనివాసరావు పాల్గొన్నారు.