Sep 18,2022 21:39

యాదమరి పిహెచ్‌సిలో...
అడ్డం పెట్టుకోవాల్సిందే..!
పెచ్చులూడుతున్న పైకప్పు
కిటీకీలకు అట్టలే అడ్డం
శిథిలావస్థలో పాత భవనాలు
నిధులు వెచ్చించడంలో నిర్లక్ష్యం
నత్తనడకన నూతన నిర్మాణాలు
ప్రజాశక్తి - యాదమరి

యాదమరి పిహెచ్‌సికి వెళ్లి వైద్యం చేయించుకోవాలన్నా, వైద్యులు వైద్యం చేయాలన్నా తలకి ఏదైనా అడ్డం పెట్టుకుని వెళితే మంచిది. ఎందుకంటే పెచ్చులూడిన భవనం పైకప్పు ఎప్పుడు ఊడి నెత్తిన పడుతుందో చెప్పలేం. ఉన్న రోగానికి వైద్యమే కాదు, హఠాత్తుగా జరిగిన పరిణామాలకూ మనమే బాధ్యులం అవుతాం. మూడు దశాబ్దాల క్రితమే ఈ భవన నిర్మాణం జరిగినా శిథిలావస్థను తలపిస్తుంది. తాజాగా నాడు-నేడులో భాగంగా నూతన నిర్మాణాలు జరుగుతున్నా అవి నత్తలను తలపిస్తున్నాయి.
సంతగేటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలూ రోగులకు వైద్యసేవలు అందించాల్సి ఉంది. నిత్యం 100-200 మంది రోగులు ఓపీకి వస్తుంటారు. అయితే ఈ దవాఖానాలో రోగులకు, వైద్యసిబ్బందికి కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఈ భవన నిర్మాణాన్ని 1991లో అప్పటి ఆరోగ్య శాఖా మంత్రి గుమ్మడి కుతూహలమ్మ ప్రారంభించారు. అప్పట్లోనే భవన నిర్మాణ పనులు నాశిరకంగా జరగడం వల్ల మూడు దశాబ్దాలకే ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంది. చెన్నరు ఐటి సంస్థ వారు యాదమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని పరిశీలించారు. భవనం నిర్మాణానికి నాడు-నేడులో కోటి 40 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. నిధులు మంజూరై మూడేళ్లవుతున్నా నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
ప్రస్తుత భవనం ఎక్కడికక్కడ బీటలు వారి ఉంది. టీకాలు నిల్వ ఉంచే గది పూర్తిగా పెచ్చులూడి ఉంది. వర్షాకాలంలో ఈ గదిలో నిత్యం నీరు ఉరుస్తూనే ఉంటుంది. శస్త్ర చికిత్స నిర్వహించే గది ఏమాత్రం తీసిపోదు. రోగులు వేచి ఉండే హాలు అయితే అంథకారం అలముకుని ఉంటుంది. ఆరు పడకలు ఉండే ఈ ఆస్పత్రిలో ప్రసవాలను పూర్తిగా నిలిపేశారు. పడకల మంచాలు తుప్పుపట్టి ఉన్నాయి. మరుగుదొడ్ల పరిస్థితి మరీ ఘోరం. సింకులన్నీ రంగు మారిపోయాయి. బీరువాలు, అల్మరాలు తుప్పు పట్టాయి. విద్యుత్‌ సరఫరా అయ్యే స్విచ్‌ బోర్డు అపుడపుడు షాక్‌ కొడుతూ ఉంటుంది. వర్షాకాలంలో లైట్లు వేయకుండా ఉండటమే మంచిది. వైద్య సిబ్బంది ఉండే గది కిటికీలకు అట్టలను అడ్డుగా పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. తలుపులు పాడైపోయాయి. సౌకర్యాలేమీ లేకపోవడంతో ఏ చిన్న కేసు వచ్చినా చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి రిఫర్‌ చేసే పరిస్థితి.
పిఎఫ్‌ఎంఎస్‌ కింద
ఆసుపత్రి అభివృద్ధి నిధులు రూ.1.75 లక్షలు
కేంద్ర ప్రభుత్వం ఆస్పత్రి అభివద్ధి నిధులను పబ్లిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్మెంట్‌ సిస్టమ్‌ పిఎఫ్‌ఎంఎస్‌ కింద రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా నేరుగా ఈ ఆర్థిక సంవత్సరానికి 2022-2023కు నిధులు 1.75 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులను హాస్పిటల్‌ డెవలప్మెంట్‌ సొసైటీ కమిటీ ద్వారా ఖర్చు చేయాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో యాదమరి పిహెచ్సి పరిధిలోని పేద రోగులకు అవసరమయ్యే మందులు, తాగునీరు, ట్యాంకుల పరిశుభ్రత, ఫర్నిచర్‌, ఆస్పత్రిలోని మరమ్మతులు, హాస్పిటల్‌ డెవలప్మెంట్‌ కమిటీ ఆమోదంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది. హాస్పిటల్‌ డెవలప్మెంట్‌ సొసైటీ కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ కమిటీలు మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షులు చైర్మన్‌గా, వైద్యాధికారి కన్వీనర్‌గా, మండల తహశీల్దార్‌, మండల అభివద్ధి అధికారి, ఒక మహిళా సర్పంచ్‌, ఆస్పత్రి సిబ్బందితో హెచ్‌డిసి కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్‌ ప్రకారం విధివిధానాల ద్వారా ఆసుపత్రి అభివద్ధి కమిటీ ఏర్పాటు అయిన సత్వరం నిధుల వ్యయంపై చర్చించాల్సి ఉంది. ఆస్పత్రిలో అత్యవసరమైన పనులకు ఈ నిధులను ఉపయోగించాల్సి ఉంది. కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేస్తారో, నిధులను ఎప్పుడు వినియోగంలోకి తెస్తారో, నూతన భవన నిర్మాణాలు అందుబాటులోకి ఎపుడు వస్తాయో వేచి చూడాల్సిందే.