Apr 07,2023 15:00
  • డిఎం అండ్ హెచ్ ఓ మహేశ్వరరావు

ప్రజాశక్తి-పాలకోడేరు : ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా గ్రామాల్లో వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు రక్తహీనత లేకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేలా సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి(డిఎం అండ్ హెచ్ ఓ) మహేశ్వరరావు అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని మండల కేంద్రమైన పాలకోడేరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందితో సమావేశం అనంతరం ర్యాలీలో పాల్గొని మాట్లాడారు గ్రామాల్లో రక్తహీనతతో చాలామంది బాధపడుతున్నారు అన్నారు. రక్తహీనత లేకుండా ఆరోగ్య సూత్రాలను చెబుతూ పౌష్టికాహారం పై అవగాహన కల్పించాలన్నారు మాతృ మరణాలు శిశు మరణాలు లేకుండా గర్భిణీలను, బాలింతలను ఎప్పటికప్పుడు వారిని పర్యవేక్షిస్తూ వారి భద్రతపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా సిజేరియన్ లు అవుతున్నాయని సిజేరియన్ లు జరక్కుండా చూడవలసిన బాధ్యత కూడా వైద్య సిబ్బంది మీదే ఉందని తెలిపారు. ఇవన్నీ జరగాలంటే ముందు ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండటానికి ఎలా ఉండాలో ప్రజలకు చెప్పవలసిన ఆవశ్యకత కూడా ఉందని తెలిపారు. ప్రభుత్వం ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని వాటిని వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం గ్రామంలో వైద్య సిబ్బంది ఆరోగ్య భద్రతపై అవగాహన కల్పించేలా ర్యాలీ చేశారు రావి చెట్టు సెంటర్లో మానవహారం నిర్వహించి నినాదాలు చేశారు. పీహెచ్సీ వైద్యాధికారిని డాక్టర్ స్వర్ణ నిరంజని, సిహెచ్ఓ సత్యనారాయణ, పీహెచ్ఎన్ కుమారి, హెల్త్ సూపర్వైజర్లు శంకర్, శ్రీనివాస్, అమ్మాజీ, ఆరోగ్య సహాయకులు, ఎంఎల్ హెచ్ పి లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.