Oct 26,2022 21:30

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకే..
విత్తన పంపిణీ నుంచి కొనుగోలు వరకు అనేక చర్యలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

వ్యవసాయరంగాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. విత్తనం పంపిణీ నుంచి ఉత్పత్తులు కొనుగోలు వరకు అన్ని చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేసి రైతుకు కావాల్సిన సహకారం అందిస్తూ ఎప్పటికప్పుడు వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సిన మార్పులు గురించి రైతుల నుంచే తెలుసుకొని వారికి కావాల్సిన విధంగా మలిచేందుకు అన్ని చర్యలు ఈ రైతుభరోసా కేంద్రాల ద్వారా తీసుకోవడం జరుగుతోంది. ఇందులో భాగంగా ఈ క్రాప్‌- బుకింగ్‌, ఈ-కేవైసి పకడ్బందీగా నిర్వహించి పంట పెట్టిన ప్రతిరైతును ఆదుకునే విధంగా చర్యలు చేపడుతున్నారు. రేపటి (27) నుంచి రైతు భరోసా కేంద్రాలలో ఈ క్రాప్‌ బుకింగ్‌, ఈ కేవైసీ చేసుకున్న వారి జాబితాలను ఉంచడం జరుగుతుంది. క్రాప్‌ ఇన్సూరెన్స్‌, ఇన్పుట్‌ సబ్సిడీ, పంట ఉత్పత్తులకు సంబంధించి మార్కెటింగ్‌ చేయనప్పుడు, విత్తన పంపిణీలు చేసేటప్పుడు రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు ఈ రెండు పథకాలు ఉపయోగపడతాయి. ఈ పథకాలు సక్రమంగా అమలు కావడానికి ప్రభుత్వం కలెక్టర్లకు కూడా ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. క్షేత్రస్థాయిలో కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు పరిశీలించే విధంగా తగుచర్యలు చేపట్టారు.
జిల్లాలో 3,51,773 ఎకరాలలో 1,55,275 మంది రైతులు ఈక్రాప్‌ బుకింగ్‌ను చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కేవైసీ 3,51,104 ఎకరాలలో1,47,625 మంది రైతులు చేసుకున్నారు. ఇందులో పీకేవైసీకి సంబంధించి మరో 7650 మంది రైతులు 18679 ఎకరాలలో వివిధ కారణాలవల్ల చేసుకోలేకపోయారు. ఈ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అత్యంత పకడ్బందీగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంబంధించిన రైతుల వివరాలను వారు సాగు చేసిన భూముల వివరాలను 27వ తేదీ అక్టోబర్‌ నుంచి అక్టోబర్‌31వ తేదీ వరకు రైతుభరోసా కేంద్రాలలో జాబితాలను ఉంచడం జరుగుతుంది. ఈ విధంగా జాబితాలను ఉంచడం వల్ల ఈ క్రాప్‌ బుకింగ్‌, ఈ కేవైసీలను క్షేత్రస్థాయిలో ఏ మేరకు చేశారన్నది రైతులు పరిశీలించుకోవచ్చు. అత్యంత పారదర్శకంగా ఏ రైతుకు నష్టం కలగకూడదని రాష్ట్రప్రభుత్వం అత్యంత పకడ్బందీగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంబంధించిన తుది జాబితాలను నవంబర్లో విడుదల చేయనున్నారు. రైతులకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే రైతు భరోసా కేంద్రాలలో ఉంచబడ్డ జాబితాలను పరిశీలించుకొనే అవకాశం కల్పించారు.
అత్యంత పారదర్శకంగా ఈ క్రాప్‌ బుకింగ్‌
-జి.మురళి కష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ఈ క్రాప్‌ బుకింగ్‌, ఈ కేవైసీ కార్యక్రమాలను నిర్వహించమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ అధికారులు, రెవెన్యూ వారితో కలసి ఈకార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించడం జరిగింది. ఏదైనా విపత్తు జరిగితే రైతును అన్నివిధాల ఆదుకోవడానికి ఈ పథకాలు ఉపయోగపడతాయి. 27వ తేదీ ఉదయం నుంచి అక్టోబర్‌ 31వరకు జాబితాలను రైతు భరోసా కేంద్రాలలో ఉంచడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో కానీ ఆన్లైన్‌ చేసే సమయంలో కానీ ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే జాబితాలను రైతులు సరిచూసుకోవాల్సి ఉంటుంది.
వ్యవసాయాన్ని లాభసాటిగా
మార్చేందుకే చర్యలు
-ఎం.హరినారాయణన్‌, జిల్లా కలెక్టర్‌
ఈ- క్రాప్‌ బుకింగ్‌, ఈ కేవైసీ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించడం జరిగింది. క్షేత్రస్థాయిలో నాతోపాటు జాయింట్‌ కలెక్టర్‌ కూడా తనిఖీ చేయడం జరిగింది. ప్రస్తుతం జాబితాలను సిద్ధం చేసి పరిశీలన కోసం రైతు భరోసా కేంద్రాలలో ఉంచడం జరిగింది. అక్టోబర్‌ 27వ తేదీ నుంచి అక్టోబర్‌ 31 వరకు రైతులు ఈ జాబితాలలో తమ పేర్లు భూముల సాగుచేసిన వివరాలను పరిశీలించుకోవాలి.