ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేసేందుకు కృషి చేయాలని ఆ సంస్థ చైర్మన్, సిఎండి హెచ్. హరనాధ రావు సూచించారు. ఎపిఎస్పిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి సంస్థ పరిధిలోని చీఫ్ ఇంజనీర్లు, జనరల్ మేనేజర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో సిఎండి హెచ్. హరనాధరావు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యవసాయ విద్యుత్తు వినియోగదారులకు పగటిపూట 9 గంటల విద్యుత్తును సరఫరా చేయాలని సూచించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం క్షేత్రస్థాయిలో అధికారుల నిరంతర పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలను తగ్గించాలని, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు వ్యయాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లను త్వరితగతిన మార్చేందుకు వీలుగా తగినస్థాయిలో నిల్వ వుంచుకునేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సంస్థ పరిధిలో ఏర్పాటు చేసే మీటర్ల సామర్థ్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా నాణ్యమైన మీటర్లను కొనుగోలు చేసేందుకు అవకాశం వుంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో డిస్కమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి. వనజ, చీఫ్ జనరల్ మేనేజర్లు ఆర్‌ఎన్ ప్రసాద్ రెడ్డి, వి. సురేష్ కుమార్, జనరల్ మేనేజర్లు వర కుమార్, గురవయ్య పాల్గొన్నారు.
మహిళా డైరెక్టర్‌గా శశికళ బాధ్యతల స్వీకరణ
ఎస్‌పిడిసిఎల్ మహిళా డైరెక్టర్ డాక్టర్ పి.బి. శశికళ శుక్రవారం ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. కర్నూలు జిల్లా, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన చెందిన డాక్టర్ పి.బి. శశికళను ఎపిఎస్పిడిసిఎల్ లో నాన్ హౌల్ టైమ్/ఉమన్ డైరెక్టర్ గా నియమిస్తూ రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఇటీవల ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఉత్తర్వుల మేరకు ఆమె ఎపిఎస్ పిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం బాధ్యతలను స్వీకరించారు.సంస్థను అభివద్ధి పథంలో నడిపేందుకు తనవంతు సహకారాన్ని అందిస్తానని తెలిపారు.










