Aug 11,2023 21:33

శిక్షణ తీసుకున్న రైతులతో శాస్త్రవేత్తలు

            ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం    రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించి అధిక దిగుబడులు సాధించాలని జాతీయ వ్యవసాయ నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ చెరుకుపల్లి శ్రీనివాసరావు సూచించారు. శుక్రవారం మండలంలోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో సమగ్ర మెట్ట వ్యవసాయం-వాతావరణ సానుకూలం.. యాజమాన్య పద్ధతులపై కూడేరు మండలం చోళసముద్రం, కరుట్లపల్లి, ఆత్మకూరు మండలం సిద్ధరాంపురం ఎస్సీ రైతులకు మూడు రోజుల శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందులో భాగంగా వ్యవసాయంలో రెట్టింపు ఆదాయం సాధించేందుకు వర్షం నీటి యాజమాన్యం, భూసారాన్ని పెంపొందించడం, మేలైన రకాలను సాగు చేయడం, నీటి కుంటలు తవ్వించుకుని బెట్ట పరిస్థితులను ఎదుర్కోవడం, చిరుధాన్యాలు సాగు చేయడం వంటి అంశాలపై రైతులకు వివరించారు. ముఖ్యంగా రైతులు చిరుధాన్యాలపై మక్కువ చూపాలన్నారు. అనంతరం సమగ్ర మెట్ట వ్యవసాయం వాతావరణ సానుకూల యాజమాన్య పద్ధతులపై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి డాక్టర్‌ బి.సహదేవరెడ్డి, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ (ఆత్మ) మద్దిలేటి, పశువిజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్‌ శ్రీనివాసనాయక్‌, ఉద్యాన ఉద్యానవన పరిశోధన స్థానం అనంతపురం అధిపతి డాక్టర్‌ సుబ్రమణ్యం, శాస్త్రవేత్తలు డాక్టర్‌ సుప్రియ, శాస్త్రవేత్త కెసి.నటరాజ్‌, పి.రాధిక, సివి.చంద్రమోహన్‌రెడ్డి, అశోక్‌కుమార్‌, వెంకటరమణ, డివి శ్రీనివాస్‌, శశికళ, యాస్మిన్‌, రామసుబ్బయ్య, కిషోర్‌, సుధీర్‌, తదితరులు పాల్గొన్నారు.