Mar 25,2023 22:31

విచారణ

      అనంతపురం ప్రతినిధి : అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖలో ఏమి జరుగుతోందన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. వ్యవసాయ శాఖలో ముందు నుంచి అనేక ఆరోపణలు వెల్లువెత్తుతూ వస్తున్నాయి. వాటిపై ఉన్నతాధికారులను విచారణాధికారులు నియమిస్తున్నారు. ఈ అధికారులు రావడం రహస్య విచారణలు జరపి, వెళ్లిపోవడంతోనే సరిపోతోంది. విచారణ అనంతరం ఎవరిపైనా చరర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అంతక మునుపు జెడిఎ మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలు రావడమే కాకుండా బాధితులు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో విత్తన కొనుగోళ్లపైనా పెద్దఎత్తున ఆరోపణలొచ్చాయి. దీంతో ఆ అధికారిని వేరే జిల్లాకు బదిలీ చేశారు. దీనిపైనా విచారణకు ఒక అధికారిని నియమించారు. ఆ అధికారి విచారణలో ఏమీ తేల్చారన్నది ఇప్పటికీ తేలని రహస్యంగానే ఉంది. ఆయన తరువాత మరో అధికారి వచ్చి వెళ్లారు. ఆ తరువాత వచ్చిన అధికారిపైనా అదే రకమైన ఫిర్యాదులు ఉన్నతాధికారులకు అందినట్టు సమాచారం. అయితే విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. డబ్బుల పంపిణీలోనూ తేడాలొచ్చి కార్యాలయంలోనే అధికారి ఛాంబర్‌లో కొంతమంది సిబ్బంది ఏకంగా కొట్టుకునే స్థాయి వరకు వెళ్లినట్టు ఆరోపణలొచ్చాయి. తరువాత ఏమీ జరగనట్టు ఎవరికి వారు సర్ధిజెప్పేకునే ప్రయత్నం చేశారు. కణేకల్‌ సీడ్‌ ఫామ్‌లో కోట్ల రూపాయాలు అవినీతి జరిగినట్టు ఆరోపణలు రావడంతో దీనిపై కమిటీని వేశారు. కమిటీ విచారణలోనూ అవినీతి తేలింది. కోట్లలో అవినీతి జరిగినట్టు తేలినా ఇప్పటి వరకు చర్యలెవరిపైనా లేవు. ఇలా వరుసగా ఒక దాని తరువాత ఒకటి ఆరోపణలొస్తున్నా కేవలం విచారణ కమిటీలకే పరిమితమవుతోంది. దీంతో ఆ శాఖలో ఏమి జరుగుతోందో అన్నది వ్యవసాయ శాఖలో సర్వత్రా చర్చ నడుస్తోంది.
మరోమారు రహస్య విచారణ
తాజాగా శుక్రవారం నాడు కూడా వ్యవసాయ శాఖలో జరుగుతున్న పరిణామాలపై ఒక అధికారి విచారణకు విచ్చేశారు. ప్రధాన కార్యాలయంలో విచారణ చేపడితే విషయం బయటకు పొక్కుతుందన్న ఉద్ధేశంతో మరోచోట రహస్య విచారణ చేపట్టారు. ఈ విచారణ ఏ అంశంపై జరిగిందన్న విషయాన్ని ఏ మాత్రం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. విచారణాధికారి సైతం పెదవి విప్పకపోవడం గమనార్హం. ఉద్యోగ బదిలీల్లో నిబంధనలు పాటించడం లేదన్న ఒక అధికారి ఫిర్యాదుపై విచారణ ప్రస్తుతం సాగుతున్నట్టు సమాచారం. ఉన్నతాధికారులు ఇచ్చిన ఉత్తర్వులను సైతం ఖాతర్‌ చేయకుండా మరొకరికి ఆ స్థానంలో నియమించడం పట్ల బాధతుడు ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ సాగినట్టు ఆ శాఖలో చర్చ సాగుతోంది.