Oct 26,2023 19:48

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి
వ్యవసాయ రంగాలతోనే సమగ్రాభివృద్ది
మాజీ మంత్రి, వెంకటగిరి శాసనసభ్యులు ఆనంరామనారాయణరెడ్డి
ప్రజాశక్తి-నెల్లూరు:రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాలంటే రైతాంగ, వ్యవసాయ రంగాలతోనే సాధ్యమవుతుందని మాజీ మంత్రి, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. గురువారం నెల్లూరు నగరంలోని డాక్టర్‌ విజరుకుమార్‌ మెమోరియల్‌ హాస్పిటల్‌ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్‌ జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్దిపై చర్చా గోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించగా, రూరల్‌ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చర్చాగోష్టికి హాజరై ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు. అనంతరం మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపుగా 70 శాతం ప్రాంతం, జిల్లా రెండూ వ్యవసాయ ఆధారిత ప్రాంతాలన్నారు. గోదావరి, కృష్ణ్ణా,పెన్నా,స్వర్ణముఖి ఇలా అనేక నదులు అనుసంధానం అవసరం అవుతుందని, అనేక మంది విషయ పరిజ్ఞానం ఉన్న సాంకేతిక నిపుణులు, ప్రజలు రాష్ట్రం సమగ్రాభివృద్ది చెందాలంటే రైతాంగ , వ్యవసాయ పరంగా అభివృద్ది సాధించాలని, నాడు ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయన్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇంకా సాధించాల్సిన చాలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
ఆ క్రమంలో కొన్ని తప్పులు చోటు చేసుకున్నాయని, వాటిని సరిచేయాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నప్పడు వారిని మేలుకొల్పాల్సిన బాధ్యత కూడా ఇటువంటి చర్చా వేదికలపై ఉందన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రిగా తాను వ్యవహరించిన సమయంలో నాలుగు సంవత్సరాల కాలానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పది నుంచి పన్నెండు శాతం నిధులు ప్రాజెక్టుల నిర్మాణానికి, సాగునీటి రంగాలకు కేటాయించామన్నారు. నేడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేవలం మూడు, నాలుగు శాతం నిధులు మాత్రమే కేటాయించడం దుర్మార్గమన్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణ పనులు అన్ని ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిలిచిపోయాయన్నారు.
మాజీ ఎంఎల్‌సి విటపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమాజంలో అందరికంటే వెనుకబడి ఎవరైతే ఉన్నారో వారి గురించి , వారి అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.సమగ్రాభివృద్ధి చెందాలంటే సమాజంలో అభివృద్ధికి చిట్టచివర ఉన్న ప్రజల గురించి, మూరు మూల ప్రాంతాల గురించి చర్చాలు ప్రారంభించాల్సి ఉందన్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన వారు సైతం ఇటువంటి చర్చల్లో పాల్గొని మాట్లాడిన నాడు అభివృద్ధి వైపు పయనించడం సులభతరం అవుతుందన్నారు.


సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య లు మాట్లాడుతూ ప్రధానంగా ఎస్‌సి,ఎస్‌టి వర్గాలు జీవిస్తున్న ప్రాంతాల్లో శ్మశాన వాటికలు లేవని, వారికి భూములు లేవని, ల్యాండ్‌ పర్చేజి పథకం కింద కొనుగోలు చేసి భూ పంపిణీ చేయాలన్నారు. ఈ సమస్యల న్నింటి సాధించుకొనేందుకు సిపిఎం ఆధ్వర్యంలో జిల్లాలో దశల వారీ పోరాటానికి సిద్ధపడుతుందన్నారు. ప్రజాసైన్సు ఉద్యమనేత జి.మాల్యాద్రి, పలువురు ప్రజా సంఘాల, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు ఈ చర్చావేదికలో పాల్గొని ప్రసంగించారు.