ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్
జిల్లాలో వ్యవసాయ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ పి.రామచంద్రారెడ్డి అన్నారు. మామిడికి మంచి ధర ఇవ్వడంలో, జిఎస్టీ తగ్గించడంలో కలెక్టర్ ,పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి సేవలు మరువలేమని అన్నారు. జిల్లాలో అత్యధికంగా మామిడి సాగవుతోందని, గత ఏడాది నుంచి రైతులు, పరిశ్రమ యజమానులు నష్టపోకుండా చాలా సమావేశాలు నిర్వహించారని ఈ ఏడాది ఎన్నడూ లేనివిధంగా మామిడి ధరలు లభించాయని, అందుకు సీజన్ చివరి వరకు కలెక్టర్ తీసుకొన్న చర్యలు కారణమని,కేంద్రం జి ఎస్టీ విషయంలో జిల్లా యంత్రాంగం నుంచి ప్రతిపాదనలు పంపడంలో ,ఆ ప్రతిపాదనలు ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవడంలో తీసుకొన్న చర్యలను ప్రశంసిస్తూ కలెక్టర్ కు సన్మానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటల వైపు కొంత మొగ్గుచూపితే మరింత మంచి ధరలు లభిస్తాయని, అదేవిధంగా ఎఫ్‌పిఓ లు ఏ పంట అయినా కోతకు వచ్చే సమయంలో మంచి ధరలు వచ్చేటట్లు చూస్తే మరింత బాగుంటుందని సూచించారు. మామిడి పంటలే కాకుండా ఇతర పంటలు కూడా సుదూర ప్రాంతాల్లో మార్కెట్ ధరలను సరిపోల్చుకుని మంచి ధరలు పొందేలా చూడాలని అన్నారు
జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని మరో విధంగా పాడి పరిశ్రమ కూడా ఎక్కువగా ఉంటుందని పరిశ్రమలు తీసుకురావడంతోపాటు ఈ రెండు రంగాలను మరింత అభివద్ధి చెందేలా చూడాలని అన్నారు. ఉద్యానవనం పంటలలో నూతన ఆవిష్కరణలకు అవకాశం ఇస్తూ ప్రోత్సహించాలని అన్నారు. వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలను పొందేందుకు నూతన వంగడాలతో పాటు పలు రకాల యంత్ర సామాగ్రి అందించడం జరుగుతుందని జిల్లా ఉద్యానవన అధికారి మధుసూదన్ రెడ్డి తెలిపారు. క్రాప్ ఇన్సూరెన్స్ రాబోయే కాలానికి మామిడి పంటకూ వచ్చేటట్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాత అవి అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. రానున్న మామిడి సీజన్ కు మొదట్లోనే కవర్లు పంపిణీ రైతు భరోసా కేంద్రాల వారిగా చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటరావు మాట్లాడుతూ పశువులను కాపాడడానికి బీరు వేస్ట్ వాడకం తగ్గించి పశువులను కాపాడేందుకు మరింతగా కషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా సభ్యుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఓకే భూమిలో వివిధ రకాల పంటలు వేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఆ పంటలను ప్రోత్సహించినట్లయితే మరింత ఉత్పత్తి పొందడం జరుగుతుందని అన్నారు. ఎఫ్ పి ఓ లు రైతులు పండించే పంటలకు అనుగుణంగా మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రకతి వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి తద్వారా వచ్చిన పంటలకు మంచి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే ప్రోత్సాహకరంగా ఉంటుందని సభ్యులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మురళీకష్ణ, ఉద్యానవన శాఖ అధికారి వెంకటేశ్వర రెడ్డి, మార్కెటింగ్ శాఖ అధికారి పరమేశ్వర్ పాల్గొన్నారు.










