Aug 23,2023 23:05

ఎండిన వేరుశనగ పంటను పరిశీలిస్తున్న సిపిఎం నాయకులు

       అనంతపురం : ప్రకృతి వైపరిత్యం, వర్షాభావంతో పంటలు ఎండిపోతుంటే... వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా సక్రమంగా అందివ్వక మరోరకంగా రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొందని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ విమర్శించారు. అనంతపురం రూరల్‌ మండల పరిధిలోని మన్నీల గ్రామ పరిధిలో బోర్ల కింద సాగుచేసిన పంట విద్యుత్‌ సరఫరా అంతరాయంతో ఎండిపోతోంది. ఈ పంటలను సిపిఎం నాయకులు బుధవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. తమ గ్రామం పరిధిలో మూడు రోజులుగా కరెంటు లేకపోవడంతో బోర్ల కిందనున్న పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిది గంటలు కరెంటు ఇస్తామని చెప్పి ఆరు గంటలకు కూడా సక్రమంగా రావడం లేదని రైతులు తెలిపారు. అది కూడా ఎప్పుడు వస్తుందో.. రాదో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు. అనంతరం రాంభూపాల్‌ మాట్లాడుతూ తొమ్మిది గంటలు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామని ప్రభుత్వం ఒకవైపు గొప్ప ప్రకటనలు చేస్తోందని తెలిపారు. ఆచరణలో చూస్తే కరెంటు ఎప్పుడు వస్తుందో.. లేదో కూడా తెలియకుండా ఉందని చెప్పారు. వర్షాల్లేక ప్రకృతి వైపరిత్యం రైతులను ఒక రకంగా దెబ్బతిస్తే... ప్రభుత్వం వైఫల్యంతో మరో విధంగా రైతులు నష్టపోయే పరిస్థితి నెలకొందని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందివ్వాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బాలరంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు రామాంజినేయులు, రైతులు లక్కప్ప, చంద్రశేఖర్‌, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలి
ఇటుకల పల్లి సబ్‌స్టేషన్‌ వద్ద రైతులు ధర్నా రాస్తారోకో

వ్యవసాయానికి 9 గంటలు నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వాలని కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.బాలరంగయ్య డిమాండ్‌ చేశారు. బుధవారం రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో అనంతపురం రూరల్‌ మండలం ఇటికలపల్లి సబ్‌ స్టేషన్‌ వద్ద ధర్నా రైతులు ధర్నా నిర్వహించారు. గంట పాటు హైవే రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాలరంగయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లికార్జున మాట్లాడుతూ నెల రోజుల నుంచి మన్నీల, కందుకూరు, కృష్ణంరెడ్డిపల్లి, ఇటుకలపల్లి, ఆకుతోటపల్లి, పూలకుంట, చియ్యేడు, చిన్నకుంట గ్రామాల పంట పొలాలకు విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేకపోవడంతో వేరుశనగ, వరి, దానిమ్మ, చీని, కాయగూరలు తదితర పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. అనేకసార్లు ఏఈ, ఏడీ, డిఇలకు విన్నవించిన స్పందన లేదన్నారు. ఏఈ, డిఈలు మాట్లాడుతూ 9 గంటలు నాణ్యమైన విద్యుత్‌ సక్రమంగా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో నాయకులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రామాంజనేయులు, సిపిఐ రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి రామకష్ణ, మండల నాయకులు నాగరాజు, ఇటుకలపల్లి మాజీ సర్పంచ్‌ అన్నగిరి పెద్దిరెడ్డి, నాయకులు అక్కులప్ప, రాజేంద్ర, ఆకుతోటపల్లి ఎంపీటీసీ సోమశేఖర్‌ రెడ్డి, మన్నిల గ్రామ రైతులు సతీష్‌, కొండయ్య, హరి, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయానికి విద్యుత్‌ కోతలపై ప్రజాప్రతినిధులు స్పందించాలి
వ్యవసాయానికి విద్యుత్‌ కోతలు విధించడం ఆపాలని, నాణ్యమైన విద్యుత్‌ అందించాలని ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ వ్యవసాయానికి విద్యుత్‌ కోతల సమస్యను వెంటనే పరిష్కరించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ కోతలతో రైతుల పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. విద్యుత్‌ ఆధికారుల నిర్లక్ష్యంతో 2, 3 గంటలే వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా అవుతుండటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితులలో రైతులు సబ్‌ స్టేషన్‌ విద్యుత్‌ కార్యాలయల ముందు రైతులు ఆందోళలు చేస్తున్నారని తెలిపారు. కావున ప్రభుత్వం ప్రకటించిన విధంగా వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్‌ సరఫరా అందించాలని కోరారు.