వ్యవసాయ మీటర్లకు రైతులు ససేమిరా..
బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ముందుకు రాని రైతులు
ఫలించని విద్యుత్‌శాఖ ప్రయత్నాలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల ఏర్పాటుకు కోసం తీవ్రకసరత్తు చేస్తోంది. ఎట్టి పరిస్థిల్లోనూ మోటర్లకు మీటర్ల ఏర్పాటుకు అంగీకరించేంది లేదంటూ రైతుల నుండీ తీవ్రవ్యతిరేకత వస్తోందని ట్రాన్స్‌కో అధికారులే స్వయంగా చెబుతున్నారు. రైతు సంఘాలు, విపక్షాలు మొదటి నుంచి వ్యవసాయ పంపుసెట్ల మీటర్ల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రైతుల నుంచి విద్యుత్‌బిల్లులు వసూలు చేయనప్పుడు మీటర్ల ఏర్పాటు ఎందుకని ప్రశ్నిస్తున్నాయి. రైతు సంఘాలు, రైతుల నుండీ పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుండంతో మీటర్ల ఏర్పాటుకు బ్యాంకు ఖాతాల తెరిపించుకు ట్రాన్స్‌కో అధికారులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వ్యవసాయ సర్వీసులు 2,98.234 ఉన్నాయి.
వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు విద్యుత్ ట్రాన్స్‌కో సంస్థలు తీవ్రప్రయత్నాలు చేస్తున్నా రైతుల నుండీ తీవ్రవ్యతిరేకత ఎదుర్కొవాల్సి వస్తోంది. బ్యాంకు ఖాతాలు తెరిపేందుకు రైతలు వ్యక్తిగత వివరాలు అందించడం లేదు. ఖాతాలు తెరిపించడం పూర్తిచేసిన వెంటనే మీటర్లు బిగిస్తారనే భయంతో రైతుల్లో నెలకొంది. ఉచిత విద్యుత్‌కు మంగళం పాడేందుకే ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు పూనుకుంటోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని రైతులు మీటర్ల ఏర్పాటుపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైతుల్లో ఆందోళన..
ఖాతాలు తెరిపంచే ప్రయత్నంలో భాగంగా రైతులు అడిగే ప్రశ్నలకు అధికారులు, సిబ్బంది సమాధానాలు చెప్పలేకపోతున్నారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించని పక్షంలో తమ ఖాతాల నగదును బదిలీ చేసుకుంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. బిల్లులు తామే చెల్లిస్తామంటున్న ప్రభుత్వం భవిష్యత్ హామీపై నిలబడుతుందన్న నమ్మకం ఏమిటని నిలదీస్తున్నారు. భవిష్యత్‌లో ప్రభుత్వం మారితే కొత్త ప్రభుత్వం దీనికి కట్టుబడి ఉంటారానే నమ్మకం ఏమిటంటున్నారు. వీటికి సమాధానాలు చెప్పలేక విద్యుత్‌శాఖ అధికారులు తలలుపట్టుకుంటున్నారు.
బ్యాంకు ఖాతాలు కీలకం..
వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ఏర్పాటు చేయాలంటే రైతులతో బ్యాంకు ఖాతాలు తెరిపంచాలి. అయితే రైతులు ఇందుకు సహకరించి వారి వ్యక్తిగత వివరాలు ఇవ్వడం లేదు. మీటర్లు ఏర్పాటుకు పై నుండీ ఆదేశాలు వస్తున్నాయి. మీటర్ల ఏర్పాటు కోసం రైతులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాం. రైతుల అంగీకారంతోనే మీటర్లు ఏర్పాటు చేస్తాం. - పద్మనాభ పిళై, ట్రాన్స్‌కో ఈఈ చిత్తూరు










