Oct 15,2023 22:47

అవగాహన కల్పిస్తున్న రోటరీ క్లబ్‌ సభ్యులు

ప్రజాశక్తి- గార : మండలంలోని శ్రీకూర్మం ఆలయంలో యాత్రికులకు అవసరమైన వసతులు సౌకర్యాలను కల్పించేందుకు రోటరీ క్లబ్‌ శ్రీకాకుళం సెంట్రల్‌ ముందుంటుందని ఆ క్లబ్‌ అధ్యక్షులు, న్యాయవాది యెరుకోల మురళీమోహనరావు తెలిపారు. శ్రీకూర్మనాథ క్షేత్రంలో రోటరీ క్లబ్‌ శ్రీకాకుళం సెంట్రల్‌ ఆధ్వర్యాన ఆదివారం స్వచ్ఛత కార్యక్రమా న్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానికంగా ఉన్న ప్రజలతో పాటు వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, దేశ విదేశాల నుంచి శ్రీకూర్మం క్షేత్రాన్ని సందర్శించేందుకు తరలివస్తూ ఉంటారని తెలిపారు. ప్రపంచంలోనే ఏకైక కూర్మనాథస్వామి క్షేత్రం కావడం యాత్రికుల రద్దీ అధికంగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చే యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి అవసరమైన వివిధ వసతులను సమకూర్చనున్నట్లు చెప్పారు. ఈ విషయమై స్థానిక కూర్మనాథ క్షేత్రం సూపరింటెండెంట్‌, అర్చకులతో తాను మాట్లాడడానని అన్నారు. యాత్రికులు స్నానాలు చేసేందుకు తాగునీటి పైపులైన్లు, పెద్దలకు పిండ ప్రదానం చేసేందుకు అవసరమైన సౌకర్యాలను తమ క్లబ్‌ తరపున ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయాలను తమ క్లబ్‌ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. స్వచ్ఛత పేరిట ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేశామని అన్నారు. అసిస్టెంట్‌ గవర్నర్‌ కె.టి. నాయుడు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుకు కావాల్సిన ఎస్టిమేషన్స్‌ తయారు చేసి రోటరీ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌కి పంపించే ఏర్పాటు చేస్తానని అన్నారు. వారి వద్ద నుంచి తగిన ఆర్థిక సహాయం అందేటట్లు చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్‌ నర్స్‌బాబు, క్లబ్‌ ప్రతినిధులు కెవిఎన్‌ దుర్గారావు, బరాటం శ్రీరామ్మూర్తి, పి.వాసు దేవరావు, డాక్టర్‌ ఎం.వెంకటేశ్వర్లు, టి.వాసుదేవరావు, నాగేశ్వరరావు, ఎన్‌.వి.భాస్కరరావు పాల్గొన్నారు.