వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం అందించాలి : కలెక్టర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్
ప్రభుత్వ వసతిగహాలలో నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ అన్నారు. జిల్లా కలెక్టర్ బుధవారం సాయంత్రం పెనుమూరు మండల కేంద్రంలోని బాలుర, బాలికల హాస్టళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ శుభ్రతను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మెనూ ప్రకారం ఆహార పదార్థాలు అందిస్తున్నారా లేరా అని విద్యార్థులను ప్రశ్నించారు. మరుగుదొడ్లు ఇతర సౌకర్యాలను పరిశీలించి విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేయాలని మెనూ ప్రకారం తప్పనిసరిగా ఆహారం అందించాలని, విద్యార్థులు వారికి ఇంటి వద్ద సౌకర్యాలు లేకపోవడంతో హాస్టళ్లకు రావడం జరుగుతుందని, ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం నాణ్యమైన భోజనం, చదువు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందని హాస్టల్ సిబ్బందితో అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ బాలికల హాస్టల్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని వసతులు సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలించారు. సాయంత్రం విద్యార్థులకు ఇవ్వాల్సిన ఆహారం మెనూ ప్రకారం ఇస్తున్నారా లేదా అని విద్యార్థునులను అడిగారు. అదేవిధంగా ఆహార పదార్థాలను పరిశీలించారు.










