వృద్ధులకు నిత్యావసరాలు పంపిణీ
ప్రజాశక్తి-కావలి : డి.ఆర్. విశ్వోదయ సేవాసమితి ఆధ్వర్యంలో ఆదివారం కావలి వెంగళరావునగర్‌లోని తమ కార్యాలయంలో 60మంది నిరుపేద వృద్ధులకు రూ.70వేలు విలువ చేసే బియ్యం, నెలసరి నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రముఖ న్యాయవాది ఎం.బాబూరావు ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ దొడ్ల రామచంద్రా రెడ్డి (డి.ఆర్.) కావలిలో లక్షలాదిమంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపారని తెలిపారు. ఆయన పేరుపై పేద వృద్ధులను ఆదుకుంటున్న వారి కుమారులు వినరు కుమార్ రెడ్డి, విద్యాధర్ కుమార్ రెడ్డిలకు అభినందనలు తెలియజేశారు. మంచి విద్యతోపాటు, సమాజానికి సేవ చేయడం గొప్ప విషయమని, ఈ కార్యక్రమంలో విద్యార్థులను కూడా భాగస్వాములను చేస్తూ వారిలో కూడా సామాజిక స్పృహ, సేవాభావం కలుగజేస్తున్నారన్నారు. తాను విశ్వోదయ, జవహర్ భారతి పూర్వ విద్యార్థి అయినందుకు గర్వపడుతున్నానన్నారు. కార్యక్రమంలో విశ్వోదయ రెక్టార్ వినయకుమార్ రెడ్డి, సేవాసమితి డైరెక్టర్ కూనం తాతిరెడ్డి, రామ్‌సెంటర్ చైర్మన్ దొడ్ల మనోహరరెడ్డి, సభ్యులు నల్లూరు రామకృష్ణ, విష్టు, సతీష్ సింగ్, రంగనాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.










