Sep 19,2022 21:03

వరసిద్ధుని తెప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తి: ఈవో
ప్రజాశక్తి- ఐరాల:
కాణిపాకం శ్రీస్వయంభు వరసిద్ధి వినాయకస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న ప్రత్యేకఉత్సవాలలో భాగంగా చివరిరోజు మంగళవారం రాత్రి జరిగే తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో సురేష్‌బాబు, చైర్మన్‌ మోహన్‌ రెడ్డిలు తెలిపారు. స్వామివారి తెప్పోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భారీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రాత్రి 12 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. అవసరమైతే దర్శనసమయాన్ని పొడిగిస్తామన్నారు. తెప్పోత్సవం సందర్భంగా తరలి వచ్చే విశేష భక్తజనం సౌకర్యార్థంగా ఉచితభోజనం, తాగునీటి సమస్య, ట్రాఫిక్‌ నియంత్రణ వంటి సదుపాయాలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే భక్తులను తరలించేందుకు రాత్రి వేళలో ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరిగే విధంగా ఆర్టీసీ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకున్నామన్నారు. తెప్పోత్సవం కార్యక్రమం రాత్రి 8గంటలకు ప్రారంభమవుతుందని ఉదయం స్వామివారికి ఉభయదారులచే అభిషేకం ఉంటుందని తెలిపారు.