వరసిద్ధి వినాయకస్వామి వారి
వార్షిక బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయండి
ప్రజాశక్తి- ఐరాల: ప్రసిద్ధిగాంచిన ప్రముఖ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ మహాకుంభాభిషేకం, ఈనెల 31వ తేదీ నుండి సెప్టెంబర్ 20వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మౌత్సవాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సమన్వయముతో పనిచేసి జయప్రదం చేయాలని జిల్లాకలెక్టర్ యం. హరినారాయణన్ పేర్కొన్నారు. బుధవారంకలెక్టర్ స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయంలో ఈనెల 21న నిర్వహించే మహాసంప్రోక్షణ కార్యక్రమం ఏర్పాట్లకు సంబంధించి పూతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్.బాబు, ఎస్పీ రిషాంత్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. మహా సంప్రోక్షణ కార్యక్రమంకు సంబంధించి చేయవలసిన ఏర్పాట్లపై కాణిపాకం దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకట సురేష్ బాబు ఈఈ వెంకట్ నారా యణ తదితరులతో చర్చించారు. అనంతరం ఆలయ సమావేశపు మందిరంలో ఉభయదారులతోపాటు వివిధ సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 20వ తేదీ వరకు జరిగే బ్రహ్మౌత్సవాల నిర్వహణకు సంబంధించి సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 21వతేదీ చతుర్వేదహవన సహిత మహాకుంభాభిషేకంకు సంబంధించి ఆలయఅధికారులు పూర్తి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. బ్రహ్మౌత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా వారికి అవసరమైన కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయలని తెలిపారు. అందులో భాగంగా భక్తులకు తాగునీటి వసతి ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆలయ ఆవరణ, సమీపంలో పారిశుధ్య ఏర్పాట్లను పంచాయతీ అధికారులు చూడాలని తెలిపారు. ఆలయానికి వచ్చే ప్రధాన రహదారులు, వీధులలో రోడ్లలో ఏవైనా చిన్నపాటి రిపైర్లు ఉంటే ఆర్ అండ్‌బి, పంచాయతీ రాజ్ శాఖలు ఆలయ అధికారులతో సమన్వయం చేసుకుని సరిచూసుకోవాలని అన్నారు. వాహనాల పార్కింగ్ కొరకు ఆలయ అధికారులు, పోలీస్ వారు రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని తెలిపారు. వేలాడే విద్యుత్ తీగల వలన ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉన్నందున అప్రమ త్తంగా ఉండాలని, జనరేటర్ల ఏర్పాటు చేసుకోవాలని విద్యుత్‌శాఖ అధికారులకు సూచించారు. మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. వైద్య, ఆర్‌డబ్ల్యుఎస్ శాఖలు భక్తులకు అందిస్తున్న తాగునీటిని పరిశీలించి వారికి సురక్షితమైన తాగునీరు అందేలా చూడాలన్నారు. ప్రథమ చికిత్స మరియు అత్యవసర పరిస్థి తుల్లో అంబులన్స్ ఏర్పాటును వైద్య శాఖ ఏర్పాటు చేయాలన్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎమ్మెల్యే ఎంఎస్.బాబు మాట్లాడుతూ ఈనెల21న జరిగే మహాకుంభాభిషేకం, బ్రహ్మౌత్సవాలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసేందుకు అందరు అధికారులతో సమన్వయం చేసుకొని విజయవంతం చేయాలని తెలిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చే వాహనాల రద్దీ నియంత్రణ చేసేందుకు, ఆలయంలో క్యూలైన్లో ఏర్పాటు బందోబస్తు తదితరాంశాలపై పోలీసు యంత్రాంగం ఆలయ అధికారులతో సమన్వయం చేసుకుంటామని భక్తులు ఇబ్బంది లేకుండా సంతప్తిగా స్వామివారి దర్శనం చేసుకొనేలా ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. సమావేశంలో చిత్తూరు ఆర్డీవో రేణుక, టెంపుల్ కస్తూరి, వివిధ సంబంధిత శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.










