
* వెదలు వేయించి ఈ-క్రాప్‌లో నమోదు చేయించాలి
* పశుసంవర్థకశాఖ మంత్రి అప్పలరాజు
* శివారు భూములకు తొలుత సాగునీరు
* అధికారులకు కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశం
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: వర్షాల్లేక రైతులు పంటలు నష్టపోయే పరిస్థితి రాకూడదని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన నీటిపారుదల, వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటలు వేయలేని చోట వెంటనే వెదలు వేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వర్షాల్లేక పంట పోయినా ఇన్సూరెన్స్ వచ్చేలా ఈ-క్రాప్‌లో వాటిని నమోదు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. సాగునీటిని రైతులకు అందించేలా నీటిపారుదలశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. షట్టర్లు, పూడిక, గుర్రపుడెక్క వంటి సమస్యలతో సాగునీరు అందించేందుకు తలెత్తుతున్న సమస్యల దృష్ట్యా తాత్కాలిక చర్యలు చేపట్టేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని నీటిపారుదలశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. రానున్న రెండు వారాలు శివారు భూములపై అధికారులు దృష్టిసారించాలన్నారు. సాగునీటి సరఫరాలో తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికి రూ.పది కోట్లతో తాత్కాలిక పనులు చేపట్టేలా ప్రతిపాదనలు తమకు సమర్పిస్తే, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తామని హామీనిచ్చారు. జిల్లాలో ఈ-క్రాప్ నమోదు, ఇకెవైసి తక్కువగా ఉందని దీనిపై వ్యవసాయాధికారులు ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పశు సంపద, పశువులకు నష్టపరిహారం వంటి వాటిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ టెక్కలి నియోజకవర్గ పరిధిలో శివారు ప్రాంత రైతులకు ఇబ్బంది లేకుండా సాగు నీరందించాలన్నారు. టెక్కలిలో 16 లిప్టులు పెట్టినా ఫలితం లేదని, నీరివ్వని ఎత్తిపోతల పథకాలతో ప్రజలను మోసం చేయడమేనని చెప్పారు. కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ శివారు ప్రాంతాలకు నీళ్లిచ్చిన తర్వాతే ఎత్తిపోతలకు పథకాలకు నీరు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వంశధార కాలువల నిర్వహణ, గుర్రపుడెక్క తొలగింపు వంటి సమస్యల పరిష్కారం కోసం నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. వంశధార ఎస్‌ఇ డోల తిరుమలరావు మాట్లాడుతూ వంశధార కుడి, ఎడమ కాలువల్లో గుర్రపుడెక్క తొలగింపు, కాలువల అడుగున కాంక్రీట్ పనుల కోసం గతంలో రూ.10 కోట్లతో ప్రతిపాదనలు పంపామని, వాటి మంజూరుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సాగునీటికి అడ్డంగా ఉన్న కాజ్‌వేలను తక్షణమే తొలగించాలని ఆర్‌అండ్‌బి అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. రానున్న రెండు వారాలు సాగునీటిని శివారు ప్రాంత భూములకు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇ-క్రాప్, ఈకెవైసి నమోదులో జిల్లా వెనుకంజలో ఉందని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించి శతశాతం పూర్తిచేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ నర్తు రామారావు, జిల్లా వ్యవసాయ సలహా మండలి, జిల్లా నీటిపారుదల సలహా మండలి, డిసిసిబి చైర్మన్లు శిమ్మ నేతాజీ, చల్లా అలివేలుమంగ, కె.రాజేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, వంశధార పర్యవేక్షక ఇంజినీర్ డోల తిరుమలరావు, జిల్లా వ్యవసాయ అధికారి కె.శ్రీధర్, నీటిపారుదల సలహా మండలి, వ్యవసాయ సలహా మండలి సభ్యులు, నీటిపారుదలశాఖ అధికారులు, అనుబంధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.