ప్రజాశక్తి-అనంతపురం నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అనంతపురం రూరల్ మండలం సోమలదొడ్డి, ఎ.నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో దెబ్బతిన్న వరిపంట పొలాలను జిల్లా వ్యవసాయ అధికారి బి.చంద్రానాయక్, డివిజన్ ఎడిఎ వెంకట్రాముడు, శాస్త్రవేత్త రమణతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఏప్రిల్ మాసంలోపే కోతకు వచ్చేలా నాట్లు వేసుకోవాలని సూచించారు. అదేవిధంగా పొడవు రకాలు కాకుండా పొట్టి రకాలు సాగు చేసుకుంటే గింజలు రాలిపోకుండా ఉండడమేకాకుండా నేలకు ఒరిగే పరిస్థితి కూడా ఉండదన్నారు. నేలకు ఒరిగిన వరి పంట, గాలికి రాలిన గింజలు మొలక ఎత్తకుండా ఉండేందుకు ఐద లీటర్ల నీటిలో యాబై గ్రాముల ఉప్పు కలిపి నీటితో పిచికారీ చేయాలని సూచించారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒక మారు వరికి బదులు పప్పుధాన్యాలు సాగు చేయాలన్నారు. దుక్కిలో సింగిల్ సూపర్ పాస్పాట్, డిఎపి ఎరువుల వేసుకోవాలని సూచించారు. బయె ఫర్టిలైజర్, పశువుల ఎరువులు వాడితే వరిలో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వరప్రసాద్, ఎఇఒ ప్రసాద్, రైతులు పాల్గొన్నారు.
గార్లదిన్నె : మండలంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న పంటలను అనంతపురం వ్యవసాయ సహాయ సంచాలకులు వెంకటరాముడు, రేకులకుంట వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త రమణ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఇప్పటి వరకు 111.8 మి.మీ వర్షం కురవడం వల్ల ఎక్కువగా వరి 565 (ఎకరాల్లో) మొక్కజొన్న 17, వేరుశనగ 3, పత్తి 3 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిళ్లిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి.సోమశేఖర్, విహెచ్‌ఒ గంపరాజు, రైతులు పాల్గొన్నారు.
అనంతపురం రూరల్ మండలంలో వర్షాలకు దెబ్బతిన్న వరిపంటను పరిశీలిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు










