వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల నేపథ్యంలో నగరపాలక అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజారోగ్య విభాగం, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని నగర కమిషనర్ డాక్టర్ జె.అరుణ ఆదేశించారు. బుధవారం కమిషనర్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా ప్రజారోగ్య విభాగం అధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, వార్డు అడ్మిన్, శానిటేషన్, ఆరోగ్య కార్యదర్శులతో మాట్లాడారు. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీటినిల్వ లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని శానిటేషన్ అధికారులను ఆదేశించారు. నిల్వనీటిని తోలగించడానికి అవసరమైన మోటార్లు, ఇతర యంత్రాలు అందుబాటులో ఉంచాలన్నారు. నగరంలో నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా, నీరు కలుషితం కాకుండా ఇంజనీరింగ్ విభాగం అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నీటిని క్లోరినేషన్ చేయించాలని, ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని తాగాలని వాలంటీర్ల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. వార్డు స్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహించాలని, అవసరమైన ప్రాథమిక మందులను అందుబాటులో ఉంచుకోవాలి అన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో ఎంఈ ధనలక్ష్మీ, ఎంహెచ్‌ఓ అనిల్ కుమార్ ఇతర అధికారులు ఉన్నారు.










