Apr 30,2023 09:02

శింగనమల మండలం తరిమెలలో నీట మునిగిన వరి పంటను పరిశీలిస్తున్నఎపి రైతుసంఘం నాయకులు

         శింగనమల : నిన్న రాత్రి కురిసిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి దెబ్బతిన్న వరి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఎపి రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, జిల్లా సహాయ కార్యదర్శి భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు మండల పరిధిలోని తరిమెల గ్రామంలో వర్షానికి నీట మునిగిన వరిపంటను రైతుసంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి వరిపంట పూర్తిగా నీట మునిగిందన్నారు. దీంతో రైతులు భారీగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు దాదాపుగా రూ.35వేల నుంచి రూ.40వేల వరకూ పెట్టుబడి సాగు చేస్తే ఇలా ఉన్నట్టుండి నష్టపోతే అప్పులు ఎలా తీర్చాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి ఎకరాకు రూ.50వేల పంట నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే మండలంలోని ఉల్లికల్లు గ్రామంలో పడిన పిడుగుపాటుకు పశుగ్రాసం దగ్ధమైనట్లు తెలుసుకున్న రైతుసంఘం నాయకులు గ్రామానికి చేరుకుని రైతులను పరామర్శించారు. పిడుగుపాటుకు రైతులు శివారెడ్డి, రామాంజనేయులురెడ్డి, మహేశ్వర్‌రెడ్డికి చెందిన మూడు గడ్డివాములు పూర్తిగా కాలిపోయాయన్నారు. ఫలితంగా ఒక్కో రైతుకు సుమారు రూ.లక్ష వరకూ నష్టం వాటిళ్లిందన్నారు. పశుగ్రాసం నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి లక్ష్మీనారాయణరెడ్డి, గంప మల్లయ్య, ఆవుల రామంజి, మల్లేష్‌, రామాంజనేయులు, నల్లప్ప, ఎదునందన, ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు.