Aug 04,2023 22:13

వరదాయపల్లిలో వంక నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్న మహిళలు

         ప్రజాశక్తి-తాడిపత్రి రూరల్‌   సాధారణంగా వేసవిలో తాగునీటి కష్టాలు తలెత్తుతాయి.. అయితే వర్షాకాలంలో కూడా మండలంలోని వరదాయపల్లిలో తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా వర్షాకాలంలో సైతం గుక్కెడు నీటికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్రామంలో ఓవర్‌హెడ్‌ ట్యాంకు ఉన్నా ఉప్పు నీరు సరఫరా అవుతుండటంతో పశువులు సైతం తాగలేని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత్యంతరం లేక గ్రామానికి ఆనుకుని ఉన్న వంకలో నిల్వ నీటిని తెచ్చుకుని తాగుతున్నామన్నారు. ఈ నీటి కోసం కూడా దాదాపు కిలోమీటర్‌ దూరం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు తాగునీటి సౌకర్యం కల్పించాలని వరదాయపల్లె వాసులు కోరుతున్నారు.