Jul 19,2023 20:36

పెరుగుతున్న గోదావరి ఉధృతి
భద్రాచలం వద్ద 31 అడుగులకు చేరిన నీటిమట్టం
పోలవరం కాపర్‌ డ్యామ్‌ వద్ద నీటిమట్టం 29 మీటర్లు
దిగువకు లక్షా 65 వేల క్యూసెక్కుల నీరు విడుదల
కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజల గుండెల్లో గుబులు
గతేడాది ఇదే సమయానికి వరద భీభత్సం
ఏడాదైన అమలు కాని ప్రభుత్వ హామీలు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
కుక్కునూరు, వేలేరుపాడు మండలంలోని గ్రామాల ప్రజలను వరద భయం వెంటాడుతోంది. వర్షాలకు గోదావరి ఉధృతి పెరుగుతుండటంతో గతేడాది భయానక పరిస్థితిని గుర్తు చేసుకుని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బుధవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 31 అడుగులకు చేరింది. పెద్దఎత్తున వరద నీరు వచ్చిపడుతుండటంతో పోలవరం కాపర్‌ డ్యామ్‌ వద్ద నీటిమట్టం 29 మీటర్లకు చేరింది. దీంతో సాయంత్రం ఐదు గంటలకు పోలవరం స్పిల్‌వే నుంచి లక్షా 65 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. గతేడాది ఈ సమయానికి గోదావరి వరదకు పోలవరం నిర్వాసిత గ్రామాల ప్రజల పరిస్థితి అత్యంత దారుణంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ గోదావరి పెరుగుతుండటంతో అక్కడి ప్రజలు గుండెల్లో రైళ్లు పెరుగుతున్నాయి. ప్రతియేటా గోదావరికి వరదలు రావడం సహజమే. గతంలో ఎన్నడూ ఏజెన్సీ ప్రజలు వరదలకు పెద్దగా భయపడిన పరిస్థితి లేదు. అయితే పోలవరం ప్రాజెక్టులో కీలకమైన కాపర్‌ డ్యామ్‌ నిర్మాణం 44 మీటర్ల పూర్తి చేశారు. దీంతో చిన్నపాటి వరదకు కూడా గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. దీంతో రోజుల వ్యవధిలోనే గోదావరి వరద గ్రామాలను ముంచెత్తుతోంది. గడిచిన రెండు రోజులుగా అల్పపీడన ప్రభావంతో జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. మంగళవారం జిల్లావ్యాప్తంగా సరాసరిన 20.05 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం సైతం భారీ వర్షం కురిసింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లోనూ పెద్దఎత్తున వర్షం కురుస్తుండటంతో గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.
అమలు కాని సిఎం ప్రకటన
పోలవరం ప్రాజెక్టులో ముంపునకు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 107 గ్రామాల ప్రజలు నిర్వాసితులుగా మారుతున్నారు. వీరికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, భూమికి భూమి, 18 ఏళ్లు నిండిన యువతకు పరిహారం, నిర్వాసిత కాలనీల్లో సదుపాయాలు వంటివి కల్పించి తరలించాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వాసితుల గురించి పట్టించుకోకుండా ప్రాజెక్టు నిర్మాణంపైన దృష్టి సారించాయి. దీంతో ప్రతియేటా గోదావరి వరదకు నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది జులైలో విరుచుకుపడిన వరదలకు 90కుపైగా గ్రామాలు నీట మునిగాయి. కట్టుబట్టలతో జనం నిర్వాసిత కాలనీలకు చేరారు. వరద బాధితుల పరామర్శకు వేలేరుపాడు మండలం కన్నాయిగూడెం గ్రామం వెళ్లిన సిఎం జగన్‌ 2022 అక్టోబర్‌కు 41.15 కాంటూరులోని గ్రామాల నిర్వాసితులందరికీ పరిహారం ఇచ్చేస్తామని, 45.72 కాంటూరు నిర్వాసితులకు మాత్రం కేంద్రం సహకరించాల్సి ఉందని తెలిపారు. సిఎం ప్రకటించి ఏడాది గడిచినా 41.15 కాంటూరు పరిధిలోని 42 గ్రామాల్లోని నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం అందించని పరిస్థితి నెలకొంది. ఎనిమిది వేల ఇళ్లు వరదలకు దెబ్బతినగా, కేవలం ఐదువేల పైచిలుకు ఇళ్లకు మాత్రమే ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందించి చేతులు దులుపుకుంది. కాపర్‌డ్యామ్‌ అడ్డుగా కట్టడంతో వరదనీరు రెండు వారాలకుపైగా గ్రామాలను వీడలేదు. వరదకు చేరిన బురదను శుభ్రం చేసుకోవడానికి ఒక్కో కుటుంబానికి రూ.20 వేలు పైనే ఖర్చయింది. నిర్వాసితులంతా నెలలు తరబడి పునరావాస కాలనీల్లో గడపాల్సిన దుస్థితి నెలకొంది. మళ్లీ గోదావరికి వరద నీరు ఉధృతం అవుతుండటంతో గతేడాది గడ్డు రోజులను అక్కడి ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. తమకు ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఒక్కరోజే కాపర్‌డ్యామ్‌ వద్ద వరద నీరు మీటర్‌కుపైగా పెరిగింది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే గతేడాది మాదిరిగా వేగంగా వరద వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. ప్రభుత్వం అందుకు తగిన ముందస్తు చర్యలు తీసుకుని జనాలకు రక్షణగా నిలవాల్సి ఉంది.