గోదావరికి పెరుగుతున్న వరద
నిలిపివేసిన పడవ ప్రయాణాలు
వంతెన నిర్మాణం గాలికి..
లంకగ్రామాల ప్రజల ఆందోళన
ప్రజాశక్తి - ఆచంట
వశిష్ట గోదావరి పొంగి ప్రవహిస్త్తోంది. దీంతో లంక గ్రామాల ప్రజలు ఆందోళన గురవుతున్నారు. పడవలే ఆధారమైన లంకవాసుల గుండెల్లో గోదావరి వరద గుబులు రేపుతోంది. రెండు రోజుల నుంచి పెరుగుతూ, తగ్గుతూ వచ్చినా మరోసారి పెరుగుతూ ఉరకలేస్తోంది. అయితే గోదావరి మధ్యలో చిన్నపాటి దీవులుగా ఉండే లంక గ్రామాలకు అవస్థలు తప్పడం లేదు. రహదారి సౌకర్యం లేదు. ఆయా గ్రామాలకు వెళ్లి రావాలంటే నాటు పడవలను ఆశ్రయించక తప్పదు. గోదావరి వరద వచ్చిందంటే ఆ ప్రాంత ప్రజలు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చుట్టూ నీళ్లలో రోజుల తరబడి గడపాల్సిన దుస్థితి లంక గ్రామ ప్రజలది. జిల్లాలోని ఆచంట మండలం పెదమల్లం పంచాయతీ పరిధి ఆనగార్లలంక, పెదమల్లంలంక, అయోధ్యలంక గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. ఆయా గ్రామాలు పూర్తిగా గోదావరి మధ్యలో ఉంటాయి. వారు బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టాలంటే పడవలను ఆశ్రయించక తప్పదు. భారీగా వస్తున్న గోదావరి వరదతో లంక గ్రామాల ప్రజల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం లంక గ్రామాల్లోని రైతులు పశువులను ఎత్తైన సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద నేపథ్యంలో ప్రభుత్వం గోదావరిలో పడవలపై ప్రయాణాలను పూర్తిగా నిషేధించింది. దీంతో లంక వాసులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బయటకు వెళ్లడానికి వీల్లేకపోవడంతో వారికి చేతిలో పని లేని పరిస్థితి ఏర్పడింది. వరద ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూడటమే వారి వంతయ్యింది.
మూగ జీవాలకు మేత కరువు..
పెనుగొండ మండలం సిద్ధాంతం వద్ద నదిలో ఉన్న మధ్యస్థలంకలో వందలాది పశువులను ఉంచి వాటిని మేపుతుంటారు. అక్కడికి పడవలను అనుమతించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో మూగ జీవాలకు మేత భారంగా మారింది.
నిలిపివేసిన పడవ ప్రయాణాలు..
గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఆచంట, యలమంచిలి మండలాల్లోని లంక గ్రామాల ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. ఆచంట మండలంలోని ఆనగార్లలంక, పెదమల్లం లంక, కోడేరు, పల్లిపాలెం, అయోధ్యలంక, పుచ్చలంక, రాయి లంక, మర్రిమూల గ్రామాలు ఉన్నాయి, ఆయా లంకల్లో దాదాపు 7 వేల మంది నివాసం ఉంటున్నారు. వీటిలో ఆనగార్లంక, అయోధ్యలంక గ్రామస్తుల పరిస్థితి మరింత దయనీయం. ఆయా లంకలు గోదావరి మధ్యలో ఉన్నాయి. కొద్ది రోజుల నుంచి గోదావరికి వరదలు రావడంతో లంక గ్రామాలకు పడవ ప్రయాణాలు నిలిపివేశారు. దీంతో వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వరద చుట్టుముట్టడంతో లంక గ్రామాల్లో ఉన్న ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
వంతెన నిర్మాణాలు విస్మరించిన పాలకులు..
అయోధ్యలంక, ఆనగార్లలంక ప్రజలు ఎప్పటినుంచో వంతెనలు నిర్మించాలని కోరుతున్నారు. అయితే వారి వేదన అరణ్య రోదనగానే మిగిలింది. నాటు పడవల్లో రాకపోకలు సాగిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వాలకు మాత్రం వంతెన నిర్మాణాలు చేపట్టడం లేదు. అయోధ్యలంకలో 2014లో సార్వత్రిక ఎన్నికలకు ముందు రూ.50 కోట్లతో అయోధ్యలంకకు, పుచ్చలంకను కలుపుతూ వంతెన నిర్మాణానికి టిడిపి హయాంలో మంత్రిగా పితాని సత్యనారాయణ అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి ఈ వంతెన నిర్మాణాన్ని పట్టించుకునే నాధుడే లేడు. ఇది ఇలా ఉండగా మరోసారి ఆనగార్లంక వాసులను మభ్యపెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. అయితే రూ.80 కోట్లతో ఆనగార్లంక - ఎర్రంశెట్టివారిపాలెం వద్ద నది మధ్య వంతెన నిర్మాణానికి గతంలో పితాని శంకుస్థాపన చేశారు. ఈ వంతెన కూడా కనుచూపు మేరా నిర్మితమయ్యే పరిస్థితిలో లేదని స్థానికులు బహిరంగంగానే చెబుతున్నారు.
తూర్పుగోదావరితోనే అనుబంధం..
మండలంలోని లంక గ్రామాలు భౌగోళికంగా జిల్లాలో ఉన్నా వారికి తూర్పుగోదావరి జిల్లాతోనే అనుబంధం ఎక్కువ. ఆనగార్లంక, పెదమల్లంలంక, పుచ్చలంక, పల్లెపాలెం వాసులకు తూర్పుగోదావరికి చేర్చే ఒకవైపు రోడ్డు సౌకర్యం ఉంది. దీంతో వారు తహశీల్దార్, గ్రామ పంచాయతీ కార్యాలయం వంటి పనులకు మాత్రమే పశ్చిమ వైపు వస్తుంటారు. నిత్యావసరాలను తూర్పుగోదావరి జిల్లా నుంచి తెచ్చుకుంటారు.
అయోధ్యలంక వాసుల పరిస్థితి దయనీయం..
అయోధ్య లంక గ్రామం పూర్తిగా గోదావరి మధ్యలో ఉంటుంది. ఆ ఊరు వెళ్లి రావాలంటే పడవ ప్రయాణమే దిక్కు. ప్రతి చిన్న పనికీ వారు పడవ ఎక్కి దిగాల్సిందే. ఈ గ్రామంలోనే సుమారు నాలుగువేల మంది జనాభా ఉన్నారు. వీరు పేరుకు పశ్చిమగోదావరిలో ఉన్నా వీరికి నిత్యం తూర్పుగోదావరి తోనే అనుబంధం ఎక్కువ. విద్య, వైద్యం, వ్యాపారం తదితరాల కోసం వారు తూర్పుగోదావరికి వెళ్లి వస్తుంటారు. వీరికి పశ్చిమ కంటే తూర్పు తీరం దగ్గర. చిన్నపాటి పాయదాటి పుచ్చలంక వెళ్తే అక్కడ నుంచి తూర్పుగోదావరి చేరుకోవడం క్షణాల్లో పని. లంకలో కొబ్బరి అరటి మొక్కజొన్న పచ్చిమిర్చి తమలపాకు కూరగాయలు, అపరాల మార్కెట్ కు వెళ్లాలంటే పడవ ద్వారానే అటు తూర్పుగోదావరి చేరుకోవాల్సిందే.
వంతెన నిర్మించాలి..
అయోధ్యలంక - పుచ్చలంక మధ్య గోదావరిపై వంతెన నిర్మాణానికి గతంలో శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకూ పనులు ప్రారంభించలేదు. వంతెన నిర్మాణం చేపడితే లంక గ్రామ వాసులు క్షేమంగా గ్రామం నుంచి బయటకు వెళ్లగలుగుతారు. లంక గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. వంతెన నిర్మిస్తామని అప్పటి పాలకులు, ప్రస్తుత ఎంఎల్‌ఎ రంగనాథరాజు కూడా ఆమె ఇచ్చారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు దాటినా ఇంతవరకూ ఆ హామీని నెరవేర్చలేదని లంకగ్రామాల ప్రజలు పెదవి విరుస్తున్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మాణాలు చేపట్టాలని వారు కోరుతున్నారు.










