Oct 01,2023 21:05

మాట్లాడుతున్న గంగరాపు సింహాచలం

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: వంశధార నిర్వాసితులకు అదనపు పరిహారాన్ని వెంటనే చెల్లించాలని వంశధార నిర్వాసితుల సంఘం నాయకులు గంగరాపు సింహాచలం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నగరంలోని ఆ సంఘ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2013 భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం చెల్లిస్తానని నమ్మబలికి ఓట్లు వేయించుకున్న ముఖ్యమంత్రి జగన్‌, నాలుగున్నరేళ్లలో ఇచ్చిన హామీని నెరవేర్చలేదని విమర్శించారు. అదనపు పరిహారం పేరుతో రూ.216.77 కోట్లు చెల్లిస్తున్నామని చెప్పి, సగం మందికి చెల్లించి మిగిలిన వారికి ఏడాదిన్నర దాటుతున్నా చెల్లించలేదని తెలిపారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను పలుమార్లు కలిసి అదనపు పరిహారం చెలింపు గురించి అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. జగన్మోహన్‌ రెడ్డి పాలనలో ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్లు నోరు మెదపలేని దుస్థితిలో ఉన్నారని చెప్పారు. గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పిన రీతిలోనే పోరాటాలు చేసి నిర్వాసితుల సత్తా చాటాలన్నారు. ఈనెల మూడో వారంలో ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వస్తున్నారని, ఆ సమయం లోగా వంశధార నిర్వాసితుల అదనపు పరిహారం బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నారు. లేకుంటే నిర్వాసితులను ఏకం చేసి సిఎం పర్యటనను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు.