Jul 14,2023 19:34

ప్రజాశక్తి - భీమవరం
జంతువుల కన్నా హీనమైన పరిస్థితుల్లో వలస కార్మికుల జీవితాలు ఉన్నాయని సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి.గోపాలన్‌ అన్నారు. గురువారం ఆరేడు గ్రామంలో చెరువులపై పనికి వచ్చిన ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన ఇద్దరు కార్మికులు టాటాఏస్‌ ఢకొీట్టగా ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మరణించిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబీకులను సిఐటియు నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా గోపాలన్‌ మాట్లాడుతూ జిల్లాలో వేలాది మంది వలస కార్మికులు ఆక్వారంగం, ఇతర రంగాల్లో పని చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వద్ద ఎంత సంఖ్యలో వలస కార్మికులు ఉన్నారో లెక్కలు లేకపోవడం సిగ్గుచేటన్నారు. వలస కార్మికుల ప్రాణాలు పిట్టల వలె రాలిపోతున్న మానవతా దృక్పథంతోనూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగినా అధికారులు తమకేమీ తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కారుచౌకగా ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను దిగుమతి చేసుకొని కనీస వసతులు కల్పించకుండా, కనీస జీతం ఇవ్వకుండా చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వలస కార్మికులకు అనేక చట్టాలున్నా క్షేత్రస్థాయిలో ఏవీ పనికిరాని కాగితాలుగా మారిపోయాయన్నారు. రానున్న కాలంలో వలస కార్మికుల కోసం పెద్దఎత్తున ఆందోళన చేపట్టబోతున్నామని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి డి.కళ్యాణి, ఉండి మండల కార్యదర్శి ధనుకొండ శ్రీనివాస్‌, ఆక్వా పరిశ్రమల వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు జి.కోటేశ్వరరావు, నేత అల్లూరి అరుణ్‌ పాల్గొన్నారు.