Apr 10,2023 21:05

జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి

ప్రజాశక్తి - భీమవరం

జిల్లాలోని వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ ఛాంబర్లో కలెక్టర్‌ అధ్యక్షతన వక్ఫ్‌ పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన వక్ఫ్‌ ఆస్తులను కేటగిరి వారీగా విభజించి సమాచారాన్ని అందజేయాలన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా విభజన అనంతరం జిల్లాకు 273.14 ఎకరాల వక్ఫ్‌ ఆస్తులను లెక్కించడం జరిగిందన్నారు. దీనిలో ఎక్కువ మొత్తం ఆక్రమణలకు గురైనట్టు గుర్తించామన్నారు. తహశీల్దార్ల ఆధ్వర్యంలో అక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలో 26 మసీదులు, 19 పీర్ల పంజాలు, 5 దర్గాలు, 4 ఈద్గాలు, ఒక సత్రం, ఒక ఆస్థాన మొత్తం 56 సంస్థలు ఉన్నాయన్నారు. వక్ఫ్‌ ఆస్తులను అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయం తక్కువగా ఉందని, అద్దెల ధరను పున్ణ సమీక్షించి ఆదాయం పెంపునకు ఆలోచన చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.కృష్ణవేణి, అడిషనల్‌ ఎస్‌పి ఎవి.సుబ్బరాజు, జిల్లా మైనార్టీ వెల్ఫేర్‌ అధికారి ఎన్‌.కృపావరం, జిల్లా సర్వే అధికారి జాషువా, ఆర్‌అండ్‌బి, అటవీ, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.