అనంతపురం ప్రతినిధి : ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే వర్షాలు పడుతుండటంతో రైతులు సేద్యానికి సన్నద్ధమవుతున్నారు. దుక్కులు దున్నుకునే పనుల్లో నిమగమయ్యారు. ఇదే సమయంలో విత్తన పంపిణీకి ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. రిజిస్ట్రేషన్ సమయంలోనే డబ్బులు కూడా ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. అటు వ్యవసాయ పనులకు, ఇటు విత్తన కొనుగోళ్లకు డబ్బులు అవసరమవడంతో రైతులు విత్తు కోసం వెతుకులాట మొదలు పెట్టారు.
రైతు భరోసా ఏదీ ?
ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతు భరోసా ఇస్తామని ప్రకటించింది. పోయిన సంవత్సరాల్లో అదేరకంగా ఇస్తూ వచ్చింది. గతేడాది అనంతపురం జిల్లా పరిధిలో 2,83,063 మందికి రూ.320.17 కోట్లు అందజేసింది. కాని ఈసారి ఇప్పటి వరకు రైతులకు రైతు భరోసా అందలేదు. ఈనెలలో రైతు భరోసా రైతులకు ఇచ్చి ఉంటే ఇప్పుడు విత్తన కొనుగోళ్లకు అవకాశం ఉండేది. ఎప్పుడు ఇస్తుందో ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు. ఇకపోతే బ్యాంకుల్లోనైనా రుణాలు అదనంగా ఇచ్చే అవకాశం లేకుండా ఉంది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఇదివరకే తీసుకున్న రుణం ఇప్పుడు చెల్లించి రెన్యువల్ చేసుకోవడానికే రైతులు బయట అప్పు తీసుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే బ్యాంకుల్లో పంటరుణాలను రెన్యువల్ చేస్తున్నారు. గతేడాది అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నా బీమా ఏదీ రైతుకు అందలేదు. దీంతో పైసల కోసం రైతులు బయట ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.
22,184 మంది రిజిస్ట్రేషన్
జిల్లాలో రెండు లక్షలకుపైగా రైతులుంటే అందులో పదో వంతు వరకే విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 78,245 క్వింటాళ్ల సబ్సిడీ విత్తనమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సేకరణ ప్రక్రియను కొనసాగిస్తోంది. అదే సమయంలో విత్తనం అసవరమైన రైతులను రిజిస్ట్రేషన్ చేసుకొమ్మని చెప్పింది. ఇప్పటి వరకు జిల్లాలో 22,184 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 19,601 క్వింటాళ్ల విత్తనం దీనికి సరిపోతుంది. ఈనెల 25వ తేదీ నుంచి విత్తన పంపిణీని ప్రారంభిస్తామని ఒకవైపు అధికారులు చెబుతున్నారు. విత్తన కొనుగోళ్లకు రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. విత్తన కొనుగోళ్లకు ముందుగా డబ్బులు చెల్లించేందుకు ఆర్థిక సమస్యలు కారణమయితే... విత్తన నాణత్యపైనా రైతుల్లో సందేహాలున్నాయి. దీంతో ప్రభుత్వమిచ్చే సబ్సిడీ విత్తనం కొనుగోలుకు వెనుకడుగు వేస్తున్నారు.
రైతుకు భరోసానివ్వాలి
చంద్రశేఖర్‌రెడ్డి ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.
రైతులు ఖరీఫ్‌కు సన్నద్ధమవుతున్నారు. అయితే గతేడాది సరైన పంటలు రైతులకు రాలేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం రైతు భరోసాను అందజేయాలి. అది వస్తే విత్తన కొనుగోళ్లు చేసుకోవడంతోపాటు, దుక్కులు దున్నుకునేందుకు అయ్యే ఖర్చులకైనా రైతులకు వస్తాయి. అదే సమయంలో గతేడాది నుంచి వరుసగా ప్రకృతి వైపరిత్యాలతో రైతులు నష్టపోయి ఉన్నారు. వారికి బీమా అందించి ఆదుకోవాలి. ఈ డబ్బులను సీజన్ ప్రారంభానికి ముందే ఇస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది.










